తమ స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శన, ప్రేక్షకుల మద్దతుతోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. బ్యాటింగ్‌లో 15 పరుగులు తక్కువగా చేసినా.. ప్రణాళికలకు తగ్గట్లు రాణించి విజయం సాధించామన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించామని తెలిపాడు. తమ ఆటగాళ్లు ఎవరూ కూడా ఒత్తిడికి లోనవ్వలేదన్నాడు. 'డ్యూ వచ్చినా మా కుర్రాళ్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆటను కొనసాగించారు. ఇది అసాధారణమైన విజయం.

మా స్పిన్నర్లు అద్భుతమైన బౌలింగ్‌తో మమ్మల్ని మ్యాచ్‌లో నిలబెట్టారు. ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం మా విజయానికి ప్రధాన కారణం. సాయి సుదర్శన్ మా బలమైన ఆటగాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టి వారు తప్పులు చేసేలా చేయడం మా వ్యూహం. ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసొచ్చింది.
డే గేమ్ అయినా.. నైట్ మ్యాచ్ అయినా ఇక్కడి ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై మా జట్టుకు మద్దతు తెలుపుతారు. ఇక మేం నమోదు చేసిన లక్ష్యం పోరాడదగినదే. కానీ మేం మరో 15 పరుగులు అదనంగా చేయాల్సింది. పిచ్ చాలా స్లోగా ఉండటంతో షాట్ బాల్స్ ఆడటం చాలా కష్టమైంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) మెరుపులు మెరిపించాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవాస్(38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్లుగా నిలిచారు.