కొలంబో: ఇతర జట్లతో ఆడినట్లు పాకిస్థాన్‌తో తరుచుగా ఆడకపోవడం వల్లనే వారి బౌలింగ్‌కు కాస్త తడబడుతున్నామని టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. పాకిస్థాన్ బౌలింగ్ భీకరంగా ఉందని, క్వాలిటీ పేసర్లు ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తరుచూ ఆడే అవకాశం ఉంటే.. ఇతర జట్ల బౌలర్లలా పాక్ పేసర్లను చీల్చి చెండాడేవాళ్లమని తెలిపాడు.
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్, తాను క్రీజులో కుదురుకుంటే పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తామని తెలిపాడు.

'ఇతర జట్లతో ఆడినట్లు పాకిస్థాన్‌తో తరచుగా మ్యాచ్‌లు ఆడం. వారి బౌలింగ్ ఎంతో మెరుగైందని, భీకరంగా ఉందని అందరికీ తెలుసు. అలాంటి బౌలర్లను తరచుగా ఎదుర్కోకపోవడం పెద్ద టోర్నీల్లో కాస్త ఇబ్బందే. పాకిస్థాన్ బౌలర్లలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. వాళ్లు భిన్నమైన బౌలర్లు. షాహిన్ అఫ్రిది బంతిని బాగా స్వింగ్ చేస్తాడు.
నసీమ్ షా బంతుల్లో వేగం ఉంటుంది. పిచ్ నుంచి సహకారం కోరుకుంటాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో పాక్ బౌలర్లు భిన్న సవాళ్లు విసురుతారు. వారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఓపెనర్లుగా నేను, రోహిత్ జట్టుకు మంచి ఆరంభాన్నివ్వాలి. ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించాలి.
రోహిత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ గాల్లో షాట్లు ఆడటాన్ని ఇష్టపడతాడు. నేను పవర్ ప్లేలో ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడుతా. భిన్నమైన శైలిలో సాగే మా ఇద్దరినీ కలిపి ఒకేసారి నియంత్రించడం ప్రత్యర్థులకు ఇబ్బందే'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ టోర్నీ లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వగా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సూపర్-4లో అడుగు పెట్టిన రెండు జట్లూ ఆదివారం మరోసారి తలపడుతున్నాయి. సూపర్ 4లో పాక్ ఇప్పటికే బంగ్లాదేశ్‌తో ఓ మ్యాచ్ ఆడి ఘనవిజయం సాధించింది. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కూడా పాక్ బౌలర్లు దుమ్మురేపారు.
ఆరంభంలో, చివర్లో పేసర్లు విజృంభించి భారత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేశారు. సూపర్-4 మ్యాచ్ పిచ్ కూడా బౌలర్లకే అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికీ.. లీగ్ దశలో మాదిరి ఫలితం రాని పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆదివారం మ్యాచ్ సాగకపోయినా.. సోమవారం రిజర్వ్ డే ఉంది.