చెత్త ఫీల్డింగ్‌తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడమే తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. 'మేం కొన్ని క్యాచ్‌లు వదిలేసాం. అవే మా కొంపముంచాయి. క్యాచ్‌లు నేలపాలు చేసినప్పుడు విజయం సాధించడం అంత సులువు కాదు. మా బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చారు.

బ్యాట్‌పైకి బంతి వస్తున్నప్పుడు పరుగులను నియంత్రించడం, లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్‌లో ఏం తక్కువ పరుగులు చేయలేదు. కొత్త బంతి కాస్త బౌలర్లకు అనుకూలించింది. 200 లక్ష్యం కాపాడుకోవాల్సినదే. 15వ ఓవర్ వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. క్యాచ్‌లు వదిలేసినప్పుడు ఒత్తిడి పెరగడం సహజం.
నల్కండే గత మ్యాచ్‌లోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ అతనితో వేయించడం వెనుక ఎలాంటి వ్యూహం లేదు. అనామక ఆటగాళ్లు ఐపీఎల్‌లో చేరడం సాధారణమే. ఇదే ఐపీఎల్ బ్యూటీ.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్ అనామక బ్యాటర్ శశాంక్ సింగ్(29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన పంజాబ్ కింగ్స్‌కు శశాంక్ సింగ్ ఊపిరి పోసాడు. అశుతోష్ శర్మతో కలిసి సంచలన బ్యాటింగ్‌తో జట్టు విజయం దిశగా నడిపాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 43 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో అషుతోష్ శర్మ ఔటైనా.. శశాంక్ సింగ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 33), రాహుల్ తెవాటియా(8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసి సంచలన విజయాన్నందుకుంది. శశాంక్ సింగ్‌కు తోడుగా అషుతోష్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) రాణించారు.