World Cup 2023లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమవ్వడాన్ని తట్టుకోలేకపోయానని టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆ సమయంలో బాధ, విసుగు తన్నుకొచ్చాయని చెప్పాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియాతో పాటు అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
పాకిస్థాన్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీ ముందు వరకు వరుస సెంచరీలతో జోరు కనబర్చిన శుభ్‌మన్ గిల్ అసలు టోర్నీలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన గిల్.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తాజాగా తన అనారోగ్యంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. డెంగ్యూ కారణంగా 6 కిలోలు తగ్గినట్లు తెలిపాడు.

ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందే తనకు అనారోగ్య లక్షణాలు కనిపించాయని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ సందర్భంగానే తాను అసౌకర్యానికి గురైనట్లు గుర్తు చేసుకున్నాడు. డెంగ్యూ నుంచి కోలుకోవడం కష్టమని చెప్పిన అతను.. టీమిండియాకు దూరంగా ఉండటం భరించలేకపోయానన్నాడు.
'డెంగ్యూ ఎలా వచ్చిందో.. ఎప్పుడో సోకిందో నాకు తెలియదు. తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా నాకు కొద్దిగా అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తొలి మ్యాచ్‌కు ముందు డెంగ్యూ అని తెలిసిపోయింది. అనారోగ్యంతో జట్టుకు దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగా అనిపించింది.
తొలిసారిగా ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీ ఆడే అవకాశం వచ్చినప్పుడు అనారోగ్యానికి గురికావటం బాధేసింది. అక్కడ నుంచి ఎలా ముందుకెళ్లాలనే దానిపై బాగా ఆలోచించా. అన్నింటికీ మించి నేను చాలా బరువు తగ్గాను. ఇది నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. డెంగ్యూ కారణంగా సుమారు 6 కిలోల బరువు తగ్గాను.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 16 పరుగులే చేసిన గిల్.. బంగ్లాదేశ్‌తో 53 పరుగులతో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల చేసిన గిల్.. ఇంగ్లండ్‌తో 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. తదుపరి మ్యాచ్‍ల్లోనైనా గిల్ పుంజుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.