ఓ బౌన్సర్ తగిలితే భయం పోతుంది: శుభ్‌మన్ గిల్

న్యూఢిల్లీ: ఒక బౌన్సర్ శరీరానికి తగిలితే వాటిపై భయం అదే పోతుందని టీమిండియా నయా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నా డు. ఆస్ట్రేలియాతో ఆఖరిటెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌ల బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొన్న గిల్ 91 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర షోషించాడు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బౌన్సర్ల కథను చెప్పుకొచ్చాడు.

తగిలితే భయం ఉండదు..
'ఒక బౌన్సర్ లేదా షార్ట్ పిచ్ బంతి శరీరానికి తగిలితే ఇక వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు అవి తగులుతాయేమో, గాయపడతామేమోనన్న ఆందోళన ఉంటుంది. ఒకసారి అవి తగిలితే ఎలాంటి భయం ఉండదు. వాస్తవానికి నా చిన్నతనంలో బౌన్సర్లు ఆడాలంటే చాలా భయపడేవాడిని. చెస్ట్ పైకి వచ్చే బంతుల కోసం ముందుగానే సిద్దంగా ఉండే వాడిని.

ఆ మూడు షాట్స్...
డ్రైవ్ షాట్స్‌ను చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. దాంతో స్ట్రెయిట్ బ్యాట్‌తో ఫుల్ షాట్ ఆడటంలో పరిణతి చెందాను. అలాగే వెనక్కి వెళ్లి కట్ షాట్ ఆడటం కూడా డెవలప్ చేసుకున్నాను. షార్ట్ బాల్స్ ఆడాలంటే భయపడేవాడిని. దాంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి వెనక్కి జరిగి కట్ షాట్ ఆడటం నేర్చుకున్నాను. ఈ రెండు మూడు షాట్స్ చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైనవి. ఇప్పుడు నా ఆటలో భాగమయ్యాయి.

అప్పుడే భయం పోయింది..
నా తొమ్మిదేళ్ల వయసులో హయ్యర్ గ్రూప్ మ్యాచ్ ఆడమన్నారు. అక్కడో బౌలర్ ఉండేవాడు. చాలా వేగంగా బంతులేసేవాడు. అతడి బౌలింగ్‌లో ఆడేటప్పుడు బౌన్సర్లు వస్తాయని భయపడేవాణ్ని. అందుకే బౌన్సర్ వచ్చినప్పుడు వంగి తప్పించుకోవాలని ముందే నిర్ణయించుకున్నా. అతడు బౌన్సర్ వేశాడు. కానీ అది చాలా ముందు పిచ్ అయింది. అయినా నేను వంగడం వల్ల బంతి నా బ్యాట్ అంచుకు తాకి బౌండరీకి వెళ్లింది. అతడు మరీ అంత ఫాస్ట్‌బౌలరేమీ కాదని అర్థమైంది. ఆ తర్వాత అతడి బౌలింగ్‌లో మరో 2-3 బౌండరీలు కొట్టాను. అందరూ ఆశ్చర్యపోయారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తోలు బంతులు, బౌన్సర్ల విషయంలో నాలోని భయాలన్నీ పోయాయి.

8 ఏళ్ల వయసులో..
నేను 2007లో మొహాలీలో అకాడమీలో చేరాను. అయితే నా వయో విభాగం పిల్లలతో ఆడడాన్ని ఆస్వాదించలేకపోయా. ఈ విషయంలో మా నాన్నతో చెప్పా. నన్ను మరో విభాగంలో మార్చాలని ఆయన కోచ్‌ను కోరాడు. కానీ కోచ్ నాకు బంతి తగులుతుందేమోనని భయపడ్డాడు. కానీ ఒక్కసారి నా ఆట చూసి నిర్ణయం తీసుకోవాలని మా నాన్న విజ్ఞప్తి చేశాడు. దాంతో కోచ్ ఓ బౌలర్‌ను పిలిచి నాకు బౌలింగ్ చేయించాడు. బాగా ఆడడం వల్ల నన్ను అండర్-14లోకి పంపించాడు. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్లు." అని శుభ్‌మన్ గిల్ గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications