టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పనితీరు అద్భుతమని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసించాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల విషయంలో హెడ్ కోచ్‌గా గంభీర్‌కు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
'మేం వరల్డ్ ఛాంపియన్స్. మా ఆటతీరు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. కొత్త కోచింగ్ సిబ్బంది నేతృత్వంలో మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం. గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అయితే.. రెండు ప్రాక్టిస్ సెషన్లలో అతని ఉద్దేశాలు, ఆటగాళ్లతో కమ్యూనికేషన్‌లో స్పష్టంగా ఉంది.

ఏ సమయంలో ఏ ఆటగాడిని ఆడించాలనే విషయంపై క్లారిటీ ఉంది. జట్టు విజయం కోసం ఏం చేయాలనేదానిపై కూడా అతనికి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. జట్టు విషయంలో గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఆలోచనా విధానం ఒకటే.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదగడమే తన లక్ష్యమని గిల్ చెప్పుకొచ్చాడు. 'టీ20 ప్రపంచకప్ ముందు నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. భవిష్యత్తులో మేం 30-40 టీ20లు ఆడాల్సి ఉంది. నా ప్రదర్శనను మెరుగుపరుచుకుంటాను. అయితే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌పైనే నా ఫోకస్ ఉంది.
జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నా పై ఎలాంటి ఒత్తిడిని తీసుకురావు. బ్యాటింగ్‌కు దిగినప్పుడు బాగా ఆడాలి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలి. వైస్ కెప్టెన్‌గా మైదానంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రమే తేడా.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం పల్లెకెలె వేదికగా తొలి టీ20 జరగనుంది. టీ20 సిరీస్ అనంతరం ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.