అందుకే ఫాలో ఆన్ ఆడించాం.. బ్యాటింగ్‌లో మార్పులు తప్పవ్: శుభ్‌మన్ గిల్
తమ బౌలర్లు అలసిపోకపోవడంతోనే అఫ్గానిస్థాన్‌ను ఫాలో ఆన్ ఆడించామని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ప్రస్తుతం భారత టెస్ట్ టీమ్ సంధి దశలో ఉందని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఉంటాయని చెప్పాడు. ముల్లాన్‌పూర్ వేదికగా సోమవారం ముగిసిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్.. ఇది సంపూర్ణ విజయమని తెలిపాడు.
ఫాలో ఆన్ ప్లాన్ అదే..
'ఇది ఒక సంపూర్ణమైన విజయం. మూడు విభాగాల్లో రాణించాం. అందుకే ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. వాతావరణం చాలా వేడిగా ఉంది. లంచ్‌కు ముందు లేదా మొదటి డ్రింక్స్ విరామం తర్వాతే వారిని ఆలౌట్ చేస్తే.. మా బౌలర్లు అలసిపోకుండా ఉన్నారో లేదో చూసి ఫాలో-ఆన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
ఒకవేళ అలా కాకపోతే.. మేం ఒక రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి.. చివర్లో అఫ్గాన్‌కు బ్యాటింగ్ అప్పగించాలని అనుకున్నాం. కానీ మాకు వేగంగా వికెట్లు దక్కాయి. దాంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. అలాగే మా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు కూడా అద్భుతం. మేం ఫాలో-ఆన్ ఇచ్చినప్పుడు సిరాజ్ కీలకమైన వికెట్ అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు.

ఆ ముగ్గురిపై మాకు అస్సలు డౌట్ లేదు....
మానవ్ సుతార్, వాషింగ్టన్, కుల్దీప్‌ల నైపుణ్యం, నాణ్యతపై మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కువ ఓవర్లు వేయించి వారికి తగి అనుభవం దక్కేలా చూశాం. ఇలాంటి పిచ్‌లపై బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలి, పేస్‌ను ఎలా మారుస్తూ ఉండాలి, వేర్వేరు ఏరియాల్లో బ్యాటర్లను ఎలా పరీక్షించాలి అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యం.
ఇది యువ జట్టు. ట్రాన్సిషన్ దశలో ఉంది. కాబట్టి జట్టులో మార్పులు ఉంటాయి. అయితే పరిస్థితులు, వేదికలతో సంబంధం లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బోర్డుపై 350 పరుగులు ఉంచడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా సరే 20 వికెట్లు తీయగలరనే నమ్మకం మా బౌలింగ్ గ్రూప్‌పై ఉంది. జట్టులో మార్పులు జరుగుతున్నప్పుడు.. బ్యాటింగ్ గ్రూప్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
మేం అనుభవాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక బ్యాటింగ్ గ్రూప్‌గా వేర్వేరు పరిస్థితుల్లో.. వేర్వేరు సందర్భాలలో ఏ విధమైన ఆట తీరు జట్టుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి, బలమైన జట్టును నిర్మించడానికి మేం ప్రయత్నిస్తున్నాము. అలాగే స్కోర్‌బోర్డ్‌పై క్రమం తప్పకుండా 350-400 పరుగులు ఎలా ఉంచాలో చూస్తున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
సంక్లిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 564/8 డిక్లెర్డ్ (శుభ్‌మన్ గిల్ 126, కేఎల్ రాహుల్ 100)
అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 152 ఆలౌట్( రెహ్మాత్ షా 60, మానవ్ సుతార్ 6/33)
అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్ (సెదిఖుల్లా అటల్ 42, వాషింగ్టన్ సుందర్ (4/36), కుల్దీప్ యాదవ్(3/30)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications