విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించామని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆఖరి రోజు విజయానికి కావాల్సిన 6 , 7 వికెట్లు తీయడం కష్టమవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో విండీస్‌ను ఫాలో ఆన్ ఆడించి ఇన్నింగ్స్ తేడాతో గెలవాలని భారత్ భావించింది. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టింది.

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై వెస్టిండీస్ పోరాడింది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆఖరి రోజు టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. విండీస్ మరో 100-120 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు విజయం కష్టమయ్యేది. ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడించడంపై విమర్శలు వచ్చాయి.
మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని శుభ్‌మన్ గిల్ వివరించాడు. 'భారత జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవం. కెప్టెన్సీకి నేను అలవాటు పడుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటున్నాను. కండిషన్స్‌కు తగ్గట్లు ఏ ఆటగాడు పరుగులు చేస్తాడు..? ఏ బౌలర్ వికెట్ తీస్తాడనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మాకు సుమారు 300 పరుగుల ఆధిక్యం లభించింది. మేం మళ్లీ బ్యాటింగ్ చేసి 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు 5, 6 వికెట్లు తీయాల్సి వస్తే కష్టమవుతుందని భావించాం. విజయం సాధించాలనే లక్ష్యంతోనే ఫాలో ఆన్ ఆడించాం. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే నితీష్ రెడ్డిని అప్‌దీ ఆర్డర్ ఆడించాం.
ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయలేదు. విదేశాల్లోనే నేరుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు. అందుకే స్వదేశంలోనే కొందరి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి వారిని విదేశీ పర్యటనకు సిద్దం చేయాలనుకున్నాం. నేను బ్యాటింగ్ వెళ్లినప్పుడు బ్యాటర్‌గానే నిర్ణయాలు తీసుకుంటాను. నేను 3-4 ఏళ్ల వయసు నుంచి బ్యాటింగ్ చేస్తున్నాను. కాబట్టి బ్యాటర్‌గా ఆలోచిస్తాను. ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తాను. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. అది సుదీర్ఘ విమాన ప్రయాణం. ఫ్లైట్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.