నాణ్యమైన స్పిన్నర్లను సమన్వయం చేయడం తలనొప్పేనని, కానీ వారి వల్లే విజయం దక్కిందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఎక్కువ బౌలింగ్ ఆప్షన్ ఉండటం మంచేదనని అభిప్రాయపడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. సమష్టి ప్రదర్శనతో ఈ విజయం దక్కిందని చెప్పాడు.
'మేం వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాం. కానీ మేం విజయాలు సాధిస్తున్నంత వరకు టాస్ ఓడిపోవడం పెద్ద విషయమే కాదు. మాకు ఇది ఒక పర్ఫెక్ట్ గేమ్. అందుకే ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. నిజాయితీగా చెప్పాలంటే.. ఇది మాకు అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ముగ్గురు శతకాలు సాధించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మేం అద్భుతంగా ఫీల్డింగ్ చేశాం. మాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు.

మంచి ఆరంభం లభిస్తే బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్. జైస్వాల్, నేను మంచి ఆరంభమే అందుకున్నాం కానీ పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాం. కానీ ఇతర బ్యాటర్లు భారీ స్కోర్లు చేశారు. వారి ఆట పట్ల సంతోషంగా ఉంది. జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పుడు రొటేట్ చేయడం కష్టం. కానీ ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు ఉండటం మంచిది. కానీ బౌలర్లను సమన్వయం చేయడం కాస్త కష్టమే. భారత జట్టులో ఆడటం సరదాగా ఉంటుంది. జట్టు కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు సిద్దంగా ఉంటారు. ఇది యువ జట్టు.. అద్భుతమైన ప్రదర్శనతో గొప్ప విజయం సాధించారు.
కెప్టెన్‌గా నేను చాలా నేర్చుకున్నాను. నేర్చుకున్న ఒకటి రెండు, విషయాలు ఏంటంటే చెప్పడం కష్టం. కానీ ఈ రెండేళ్లలో మేం జట్టుగా ఒకటయ్యాం. క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాం అనేది చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మేం ఇంకా నేర్చుకునే దశలో ఉన్న జట్టు. మాకు లభించే అనుభవాల నుంచి మేం నేర్చుకుంటూ ఉన్నంత వరకు.. మాకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.