ఆ ఇద్దర్నీ ఔట్ చేస్తే విజయం మాదే అని తెలుసు:శుభ్‌మన్ గిల్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లను పవర్ ప్లేలోనే ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే విషయం తమకు తెలుసని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఈ ప్రణాళికకు తగ్గట్లుగానే వారిని త్వరగా ఔట్ చేసి రాజస్థాన్ రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చామని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ జట్టు వరుస విజయాలపై సంతోషం వ్యక్తం చేశాడు.
ఇది మా పర్ఫెక్ట్ గేమ్..
'మా వరుస విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఖచ్చితంగా ఈ మ్యాచ్‌కి ముందు కూడా మేం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు మేం ఒక 'పర్ఫెక్ట్ మ్యాచ్' ఆడలేదని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన ఒక స్పష్టమైన విజయం. ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెబుతాను.

మేం బోర్డుపై ఒక 10-15 పరుగులు అదనంగానే సాధించామని అనుకుంటున్నా. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు పిచ్ సహకరిస్తుందని మేం భావించాం. సిక్సర్లు కొట్టడం లేదా బౌండరీలు రాబట్టడం అంత సులువు కాదు. బంతి కొంచెం గ్రిప్ అవుతోంది. మేం బోర్డుపై 230 పరుగులు ఉంచాం. పవర్‌ప్లేలో ఒక రెండు వికెట్లు తీస్తే.. మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని మాకు తెలుసు.
పవర్ ప్లేలో ఔట్ చేస్తే..
మేం కూడా 250 పరుగులు వస్తాయని అనుకున్నాం. బౌలర్లపై ఒత్తిడి పెంచి ఎంత స్కోరు సాధించగలమో చూద్దాం అనుకున్నాం. కానీ స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా మారింది. అందుకే వికెట్లు చేతిలో ఉంచుకుని ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. 17, 18వ ఓవర్లలో మాకు బౌండరీలు రాలేదు. కానీ చివరి ఓవర్‌లో ఆ లోటును పూడ్చగలిగాం.
పవర్‌ప్లేలోనే ఓపెనర్లను ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే విషయం మాకు తెలుసు. అందుకే మా ప్రధాన బౌలర్లను ఉపయోగించాను. పవర్‌ప్లేలో వికెట్లు తీస్తే.. అది మిడిల్ ఓవర్లలో మా బౌలర్లకు అటాక్ చేయడానికి, మరిన్ని వికెట్లు తీయడానికి అవకాశం ఇస్తుంది. ప్రస్తుత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ , పిచ్‌ల స్వభావాన్ని బట్టి చూస్తే, ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడానికి వికెట్లు తీయడం ఒక్కటే మార్గం.
వికెట్లు తీయడం ఒక్కటే మార్గం..
అందుకే ఎప్పుడూ వికెట్ల కోసం అటాకింగ్ మోడ్‌లో ఉండాలని చూశాం. ఏది ఏమైనా మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. మా తదుపరి మ్యాచ్ మా హోమ్ గ్రౌండ్‌లో ఉంది. అక్కడ కూడా మరో మంచి మ్యాచ్ ఆడుతామని ఆశిస్తున్నాను. పరుగు తీస్తున్న సమయంలో నా కాలు కొంచెం బెణికింది. అప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. కానీ ఒక అరగంట తర్వాత సెట్ అయ్యింది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications