టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. వరుసగా విఫలమవుతున్నా.. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టీ20ల్లో సంజూ శాంసన్ 3 శతకాలు నమోదు చేశాడని, అయినా అతన్ని జట్టులో నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు. వైస్ కెప్టెన్, కెప్టెన్‌లు ఫామ్‌లో లేకపోయినా జట్టులో కొనసాగుతారా? అని నిలదీసాడు.
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 4 పరుగులు చేసిన గిల్.. రెండో మ్యాచ్‌లో డకౌటయ్యాడు. శుభ్‌మన్ గిల్ కోసం బాగా ఆడుతున్న సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించారు. సంజూ శాంసన్ తర్వాత ఓపెనర్‌గా 14 ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 23.90 సగటుతో 263 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ తమిళ్ షోలో మాట్లాడిన బద్రీనాథ్.. టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. 'సంజూ శాంసన్ మూడు సెంచరీలు చేశాడు. మనం టీ20 క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫార్మాట్‌లో సంజూ మూడు సెంచరీలు చేశాడు. ఒక ఆటగాడి నుంచి ఇంకేం కావాలి? ఇంత బాగా ఆడిన ఆటగాడు బెంచ్‌పై కూర్చోవడం చూడటం కొంచెం బాధగా ఉంది.
శుభ్‌మన్ గిల్ టీమిండియా వైస్ కెప్టెన్. జట్టులోని 11 మందిలో కచ్చితంగా ఉండాలనే ఆటగాడు మాత్రమే కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ అవుతాడనేది నా నమ్మకం. కానీ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. గిల్‌కు బ్యాకప్ లేకపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ టీ20ల్లో ప్రతిభకు కొరత లేదు.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.