అదే మా తదుపరి లక్ష్యం: శుభ్‌మన్ గిల్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే తమ తదుపరి లక్ష్యమని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో కప్‌ను చేజార్చుకుంది.
న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న శుభ్‌మన్ గిల్.. తమ తదుపరి లక్ష్యం గురించి వెల్లడించాడు.
ప్రపంచకప్ గెలవడమే..
'వన్డే ప్రపంచకప్ గెలవడం మా తదుపరి లక్ష్యం. గత ఫైనల్లోనే మేం తృటిలో టైటిల్ కోల్పోయాం. సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027 మాకు మరో అవకాశం. ఏ ఫార్మాట్‌లోనైనా దేశం కోసం ప్రపంచకప్‌ను గెలవడం మా ప్రధాన లక్ష్యం. ఈ ఆలోచన ఎప్పుడూ నా మనసులో తిరుగుతూనే ఉంటుంది.’అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
మరోవైపు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మళ్లీ ఆడాలని ఉందా? అని ప్రశ్నించగా.. ఖచ్చితంగా అని బదులిచ్చాడు. 'అహ్మదాబాద్‌లో జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను మళ్లీ ఆడి విజయం సాధించాలనే నేను కోరుకుంటాను.’అని సూర్య తెలిపాడు.

భారత్ జైత్రయాత్ర మొదలైంది..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం మెగా టోర్నీల్లో భారత జట్లకు స్ఫూర్తినిచ్చిందని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. 'మనకు ఒక చిన్న నిప్పురవ్వ లేదా ఒక అడుగు మాత్రమే అవసరమైంది. దాన్ని 2024లో అధిగమించాం. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025లో మహిళల వన్డే ప్రపంచకప్, ఆపై 2026 ఈవెంట్‌లతో వరుస విజయాలు వచ్చాయి. ఇప్పుడు వెనక్కి చూసే ఆలోచన లేదు. ఈ అద్భుతమైన ప్రయాణం మొదలైంది కాబట్టి, సాధ్యమైనన్ని ఎక్కువ టైటిల్స్‌ను గెలవడానికి ప్రయత్నిస్తాం’అని సూర్య విశ్వాసం వ్యక్తం చేశాడు.
తదుపరి టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొన్నాడు. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలిచినప్పుడు మూడో సారి ఎందుకు గెలవలేం అని ప్రశ్నించాడు. ఖచ్చితంగా ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధిస్తామని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications