For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ప్రపంచకప్ గెలవాలంటే.. మేం చాలా మెరుగవ్వాలి: శుభ్‌మన్ గిల్

వన్డే ప్రపంచకప్ 2027 ముందు టీమిండియా చాలా విషయాల్లో మెరుగవ్వాలని వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోల్పోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని తాము కొన్ని ప్రయోగాలు చేశామని, అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అంగీకరించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ పరాజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో న్యూజిలాండ్‌కు కోల్పోయింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన గిల్.. తమ ఆట తీరు నిరాశకు గురి చేసిందన్నాడు. విరాట్ కోహ్లీ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన ఈ సిరీస్‌లో తమకు సానుకూల అంశాలని తెలిపాడు.

Shubman Gill Criticizes Spinners After India Lose ODI Series to New Zealand

నితీష్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తాం..

'తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత రెండో మ్యాచ్‌లో ఓడిపోయాం. ఇండోర్‌లో 1-1తో ఆడాం. కానీ ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు తీవ్ర నిరాశకు గురి చేసింది. మేం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన, సమీక్షించుకోవాల్సిన, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఓడినా.. మా సానుకూల అంశాలు ఏంటంటే.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు ఎప్పుడూ జట్టుకు ప్లస్ పాయింట్.

ఈ సిరీస్‌లో హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. 8వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. అతను బాధ్యత తీసుకున్న తీరు, ఈ సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం కూడా బాగుంది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మేం నితీష్ రెడ్డితో ఈ రోజు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించాం. భవిష్యత్తులో అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. అతనికి తగినన్ని ఓవర్లు బౌలింగ్ ఇచ్చి, మాకు కావాల్సిన కాంబినేషన్‌పై వర్కౌట్ చేస్తాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ శతకం వృథా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124) శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్ ఒక వికెట్ తీసాడు.

Story first published: Sunday, January 18, 2026, 22:15 [IST]
Other articles published on Jan 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+