టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంనియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక శతకాలతో పాటు పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. వెస్టిండీస్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీ చేయడం ద్వారా శుభ్‌మన్ గిల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ క్రమంలో అతను పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీలో శుభ్‌మన్ గిల్ 10 శతకాలు నమోదు చేశాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది ఐదో సెంచరీ. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘటన సాధించిన భారత టెస్ట్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. 2017, 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఐదేసి సెంచరీలు నమోదు చేశాడు.

డబ్ల్యూటీసీలో శుభ్‌మన్ గిల్ 10 సెంచరీలతో 2826 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను రిషభ్ పంత్‌ను అధిగమించాడు. పంత్ 6 శతకాలతో 2731 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 9 సెంచరీలతో 2716, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో 2617, రవీంద్ర జడేజా 5 సెంచరీలతో 2505 పరుగులు చేశాడు. 71 ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ గిల్ 10 శతకాలు నమోదు చేయడం గమనార్హం.
కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 శతకాలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డు సాధించాడు. సునీల్ గవాస్కర్ 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధిస్తే.. గిల్ 12 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 26 ఏళ్ల వయసులోనే 19 శతకాలు తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.