
హరారే: టీ20లు రాజ్యమేలుతున్న క్రికెట్‌లో ఆల్‌రౌండర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా, బౌలర్‌గా మాత్రమే ఉంటానంటే ప్రస్తుత పరిస్థితులు సహకరించడం లేదు. బ్యాటర్లు కనీసం పార్ట్‌టైమ్ బౌలర్లుగా ఒకటి రెండు ఓవర్లు వేసినా.. బౌలర్లు చివర్లో హిట్టింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నా అడ్వాంటేజ్‌గా మారుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాడు. టీ20 ప్రపంచకప్ బెర్తే లక్ష్యంగా సన్నదమవుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో ఒక్కో ప్లేస్‌కు ముగ్గురేసి ఆటగాళ్లు పోటీపడుతున్న క్రమంలో చోటు దక్కించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఓపెనర్ బ్యాటర్ అయిన అతను బౌలింగ్ చేయాలనుకుంటున్నాడు. మిస్టరీ స్పిన్‌తో పార్ట్ టైమ్ బౌలర్‌గా జట్టుకు సేవలందించుకుంటున్నాడు. ఆ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజం సునీల్ నరైన్ శైలిని అనుకరిస్తూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన గిల్.. ఆ ప్రదర్శనతో జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక్కడ సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నాడు.
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో మిడిలార్డర్‌లో ఆడనున్న గిల్.. పార్ట్ టైమ్ బౌలర్‌గా రాణించి భారత జట్టులోకి రావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం నెట్స్‌లో గిల్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేసిన గిల్.. క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇదే తరహాలో బౌలింగ్ చేస్తే భారత జట్టులో చోటు దక్కడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.