టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చర్రిత సృష్టించాడు. అత్యధిక సార్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ప్రతి నెలలో మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పేరిట అవార్డ్స్ ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జూలైకి సంబంధించిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ శుభ్‌మన్ గిల్‌ను వరించింది. ఇది శుభ్‌మన్ గిల్‌కు నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా నాలుగు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ గెలుచుకోలేదు. ఇంగ్లండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఈ అవార్డు లభించింది.

జూలై నెలకు సంబంధించిన ఈ అవార్డు రేసులో శుభ్‌మన్ గిల్‌తో పాటు బెన్ స్టోక్స్, వియాన్ మల్డర్ పోటీ పడ్డారు. కానీ అభిమానులు శుభ్‌మన్ గిల్‌కే ఓటేసారు. ఇంగ్లండ్ గడ్డపై జూలైలో మూడు టెస్ట్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ గెలుచుకున్న శుభ్‌మన్ గిల్.. 2023 సెప్టెంబర్‌లో తొలి అవార్డ్ అందుకున్నాడు.
ఈ అవార్డ్ అందుకోవడంపై శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నేను కెప్టెన్‌గా ఆడిన నా తొలి టెస్ట్ సిరీస్‌లోనే ఈ అవార్డు దక్కడం గొప్ప అనుభూతినిస్తోంది. బర్మింగ్‌హామ్ వేదికగా సాధించిన డబుల్ సెంచరీని నేను ఎప్పటికీ మరిచిపోను. నా ఇంగ్లండ్ పర్యటనలో ఈ డబుల్ సెంచరీ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది.'అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, బాబర్ అజామ్, షకీబ్ అల్ హసన్, కమిందు మెండిస్ వంటి ఆటగాళ్లు రెండేసి సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. విరాట్ కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ అందుకోవడం గమనార్హం.