రోహిత్ రిటైర్మెంట్.. తేల్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ జరిగిన ప్రచారాన్ని ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొట్టి పారేసాడు. కేవలం ఇది మీడియా సృష్టేనని, జట్టులో రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశాడు.
2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను సెలెక్టర్లు తప్పించారని, ఈ విషయాన్ని అతనికి తెలియజేశారని వార్తలు వచ్చాయి. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారని, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ అంటూ ప్రచారం జరిగింది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తన బ్యాటింగ్‌తో రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు. లార్డ్స్‌లో వన్డే శతకం బాదిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో రోహిత్ శతకం వృథా అయ్యింది.
అదంతా మీడియా సృష్టే..
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న శుభ్‌మన్ గిల్‌ను రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై ప్రశ్నించగా.. కొట్టిపారేసాడు. 'రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ మాకు ఏం చెప్పలేదు. ఇదంతా మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని నేను భావిస్తున్నా. కానీ జట్టులో రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు.'అని స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ భాయ్ తన్న ఇన్నింగ్స్ నిర్మించిన విధానం అద్భుతమని కొనియాడాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించానని చెప్పాడు. 'రోహిత్ భాయ్ నా ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. నేను ఎక్కువ సమయం నాన్ స్ట్రైకర్‌గా ఉండి రోహిత్ బ్యాటింగ్ చూడటానికే సరిపోయింది. వికెట్లను కాపాడుకోవడం గురించి మేం ప్రధానంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మాకు ఉన్న ఏకైక మార్గం ఇదే.
చూడముచ్చటగా రోహిత్ బ్యాటింగ్..
పవర్ ప్లేలోనూ దూకుడుగా ఆడాలనుకున్నాం. కానీ కొత్త బంతితో ఎదురు దాడికి దిగడం సరికాదని భావించాం. రోహిత్ భాయ్ తన ఇన్నింగ్స్‌ను నిర్మించుకొని, ఆపై దూకుడుగా ఆడిన తీరు అద్భుతం. ఒక్కసారి రోహిత్ 60, 70ల్లోకి వచ్చాక.. ఆయన బ్యాటింగ్ చూడటం నిజంగా కనివిందుగా ఉంటుంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
బౌలింగ్ వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణమని శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. 45వ ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చామని, కానీ బౌలింగ్‌లో చివరి మూడు ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.
వికెట్లు ఉంటే గెలిచేవాళ్లం..
'ఈ మ్యాచ్‌లో 45వ ఓవర్ వరకు మేం గట్టి పోటీ ఇచ్చాం. కానీ బౌలింగ్‌లో ఆఖరి మూడు ఓవర్లలో 60 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాం. అక్కడే మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. అయినా ఛేజింగ్‌లో మేం పోరాడాం.
40 ఓవర్ల తర్వాత మా చేతిలో వికెట్లు ఉంటే మేం గెలిచేవాళ్లం. ఏ దశలోనూ మేం ఓటమికి అంగీకరించలేదు. అందుకే పవర్ ప్లే తర్వాత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాం. రన్‌రేట్‌ను 6- 6.5 ఉండేలా ఆడాం. అలా ఆడి చివరి 10 ఓవర్లలో 100-110 పరుగులు చేయాల్సి వస్తే.. మ్యాచ్ గెలవచ్చని భావించాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

