టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
'ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గత శనివారం(అక్టోబర్ 25) జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతని ఎడమ పక్కటెముకల్లో గాయమైంది. టెస్ట్‌ల కోసం అతన్ని ఆసుప్రతిలో చేర్చాం. స్కాన్స్‌లో ప్లీహానికి చీలిక గాయమైనట్లు తేలింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. వైద్యపరంగా అయ్యర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గాయం నుంచి బాగానే కోలుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోంది. టీమిండియా డాక్టర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సిడ్నీలో ఉండనున్నాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.

ప్లీహం అనేది ఎడమ పక్కటెముకల కింద ఉండే చిన్న అవయవం. ఇది రక్త శుద్ధి, రోగ నిరోధక వ్యవస్థ పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అయవంలో చీలిక రావడంతో అంతర్గత రక్త స్రావం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన బీసీసీఐ మెడికల్ టీమ్.. శ్రేయస్ అయ్యర్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తుంది. వైద్యులు రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బ్లీడింగ్ ఆగిపోయి, ఇన్‌ఫెక్షన్ కాకుండా ఉంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్త స్రావం జరగడం, ఐసీయూలో చేర్చారనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతని గాయంపై క్లారిటీ ఇచ్చింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరుగెత్తి అందుకునే క్రమంలో కిందపడి గాయపడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాలుగు నుంచి 6 వారాలు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరంగా కానున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే శ్రేయస్ అయ్యర్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న శ్రేయస్ అయ్యర్.. అంతలోనే తీవ్ర గాయంతో జట్టుకు దూరమయ్యాడు.