
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ జాక్‌పాట్ కొట్టేసింది. భారీ అంచనాలున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకుంది. కెప్టెన్ స్కిల్స్‌తో పాటు ఇండియన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కావడంతో రూ. 20 కోట్ల వరకు పలుకుతాడని అంతా భావించినా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మరే ఫ్రాంచైజీ అయ్యర్ కోసం ఆసక్తి చూపలేదు.
దాంతో అయ్యర్ కోసం ఢిల్లీ, కేకేఆర్ తీవ్రంగా పోటీపడ్డాయి. 9 కోట్ల ధరకే కేకేఆర్ సొంతం చేసుకునే అవకాశం ఉండగా.. ఢిల్లీ మైండ్ గేమ్ ఆడింది. కేకేఆర్ అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ వేలంలో మరింత బిడ్ చేసింది. చివరకు రూ. 12.25 కోట్లు చేరగానే వదిలేసింది. ముందుగా అనుకున్నట్లు అయ్యర్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు పోటీపడతాయని భావించినప్పటీకీ ఆ ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అతన్ని పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలన్నీ వేలంలో ఆచితూచి ఖర్చు చేస్తున్నాయి.
ఇక గత సీజన్ మినీ వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. ఈ లెక్కన అతని ఐపీఎల్ సాలరీ రూ. 5.25 కోట్లు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ తమ కెప్టెన్‌గా కూడా నియమించుకునే అవకాశం ఉంది. అందుకోసం ఆ ఫ్రాంచైజీ ఢిల్లీ కోసం తీవ్రంగా పోటీపడింది.
ఇక వేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్, రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 7.25 కోట్లకు, కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు, మహమ్మద్ షమీ రూ. 6.25 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.