టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అతని పక్కటెముకల్లోని ప్లీహంలో చీలిక రావడంతో పాటు అంతర్గత రక్త స్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. భారత ఫిజియోల వేగవంతమైన ట్రీట్‌మెంట్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికే పరిమితమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ గాయంతో మూడు నెలల పాటు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

ఈ టోర్నీలో భాగంగా జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడని బీసీసీఐ సీఓఈకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు. అయితే, న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతాడా? లేదా అనేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
'శ్రేయస్ అయ్యర్ శుక్రవారం(జనవరి 2) తన మొదటి 50-ఓవర్ల 'రిటర్న్ టు ప్లే' మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందడానికి ముందు అతను జనవరి 6న రెండో రిటర్న్ టు ప్లే మ్యాచ్‌గా విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు.'అని సదరు అధికారి వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ జనవరి 11న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. శనివారం ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే అతనికి వన్డే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయ్యర్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికవ్వకపోతే ఐపీఎల్ 2026లో బరిలోకి దిగనున్నాడు. ఎందుకంటే న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో అతనికి చోటు దక్కలేదు. కేవలం అతను వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.