ఇంకా తమ అసలు సిసలు ఆట ఆడలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా విధ్వంసకర బ్యాటింగ్‌తో 219 పరుగుల భారీ స్కోర్ చేసిన పంజాబ్.. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను 201 పరుగులకే పరిమితం చేసింది.
పంజాబ్ కింగ్స్ యువ ఓపెన్ ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103) విధ్వంసకర సెంచరీతో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఇది తమ బ్యాటింగ్ టెంప్లెట్ అని, వేదిక ఏదైనా.. పిచ్ మరేదైనా తమ అప్రోచ్‌లో తేడా ఉండదన్నాడు.

'ఇది మా బ్యాటింగ్ టెంప్లెట్. గ్రౌండ్ ఏదైనా.. మా ఆట తీరు ఇలానే ఉంటుంది. మా జట్టులో పవర్ హిట్టర్స్ ఉన్నారు. ప్రియాన్ష్ ఆర్య ఆడిన తీరు చూడ ముచ్చటగా ఉంది. ఇది ఏ మాత్రం వరల్డ్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ కాదు. గత మ్యాచ్ వైఫల్యం అనంతరం నేను అతనితో మాట్లాడాను. జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొన్నప్పుడు షాట్ సెలెక్షన్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. ఈ రోజు తన బలాలను నమ్ముకొని చెలరేగాడు. స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. మా జట్టులోని ప్రతీ ఆటగాడు ఇలానే స్వేచ్చగా ఆడాలని కోరుకుంటున్నా. నేను చూసిన ఐపీఎల్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి.
యుజ్వేంద్ర చాహల్‌తో బౌలింగ్ చేయించకపోవడం వ్యూహాత్మక నిర్ణయం. అప్పటికే శివమ్ దూబే, డెవాన్ కాన్వే క్రీజులో సెట్ అయ్యారు. అలాంటి సమయంలో యుజ్వేంద్ర చాహల్‌తో బౌలింగ్ చేయిస్తే.. శివమ్ దూబే ఎలా చెలరేగుతాడో మాకు బాగా తెలుసు. పేసర్లతో బౌలింగ్ చేయించడమే సరైనదని నాకు అనిపించింది. ప్రాథమికంగా దూబే రాగానే పేసర్లతో బౌలింగ్ చేయించాలని ముందే అనుకున్నాం. కానీ మేం కాస్త ఆలస్యం చేశాం. అయినా మా వ్యూహం ఫలించింది. మా ఫీల్డింగ్ గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. టోర్నీ ఆరంభంలో ఉన్నాం కాబట్టి.. ఆ భయం ఇంకా అలానే ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.