ఇండోర్: ఎన్ని సెంచరీలు బాదినా.. ఎంత నిలకడగా రాణించినా కోహ్లీ స్థానాన్ని కొట్టేయలేమని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer) తెలిపాడు. గత ఏడాదిగా గాయాలతో సతమతమైన ఈ స్టార్ బ్యాటర్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా మిడిలార్డర్‌లో తానే కీలకమవుతానని నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీ బాదడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 99 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ(Virat Kohli)కి చెందిన మూడో స్థానాన్ని దొంగలించలేమని చమత్కరించాడు.
'నా క్రికెట్ ప్రయాణం ఒడిదొడుకులుగా మారింది. చివరకు సెంచరీతో ఫామ్ అందుకోవడం సంతోషంగా ఉంది. సహచర ఆటగాళ్లు, నా కుటుంబం, కోచ్‌లు ఎంతో అండగా నిలిచారు.
నేను టీవీల్లో మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆడుదామా? అని అనుకున్నా. కానీ గాయాలు నన్ను వెంటాడాయి. కానీ నా లక్ష్యంపై నాకు స్పష్టత ఉంది. మొత్తానికి రీఎంట్రీ ఇచ్చి రాణించడం సంతోషంగా ఉంది. ఈ రోజు నా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. నేను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వెళ్లినా క్రీజులో సెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తా.
అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నా. జట్టు ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడుతా. విరాట్ కోహ్లీ ఓ దిగ్గజ ఆటగాడు. అతని నెంబర్ 3 స్థానాన్ని మనం దొంగలించలేం. అందుకే ఏ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినా పరుగులు చేయాలనుకుంటున్నా.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 53), సీన్ అబాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.
400 పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విజయంతో మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండానే 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.