టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయ్యర్ తృటిలో చావును తప్పించుకున్నాడని తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయమైన సమయంలో శ్రేయస్ అయ్యర్ ఆక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయాయని, పది నిమిషాల పాటు అతను నిలబడలేకపోయాడని, శరీరం పూర్తిగా బ్లాక్ ఔటైందని వైద్యులు చెప్పినట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది.
టీమిండియా వైద్యులు వేగంగా స్పందించి చికిత్స అందించడంతోనే శ్రేయస్ అయ్యర్ ప్రాణాలతో బయటపడ్డాడని సదరు నివేదిక స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను వెనక్కి పరుగెడుతూ అందుకునే క్రమంలో అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ పక్కటి ఎముకలు నేలకు బలంగా తాకడంతో అతని ప్లీహంలో చీలిక వచ్చి అంతర్గత రక్త స్రావమైంది. అతన్ని హుటాహుటినా సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు.

రక్త స్రావం ఆగడంతో పాటు గాయం వేగంగా నయమవుతుండటంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. అయితే మైదానంలోకి దిగేందుకు మాత్రం శ్రేయస్ అయ్యర్‌కు ఇంకా చాలా సమయం పట్టనుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు నెల కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నవంబర్ 30 నుంచి రాంచీ, రాజ్‌కోట్, విశాఖపట్నం వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. డిశ్చార్జ్ అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన శ్రేయస్ అయ్యర్.. ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌లో చిల్ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అయ్యర్ పంచుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు తాజా గాయం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు.