పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన ఫైనల్లో ఫీల్డర్లు చేసిన తప్పిదాలపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్.. బంతిని బౌండరీ లైన్‌లోకి తన్నడంపై అసహనం వ్యక్తం చేశాడు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఆరో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని మయాంక్ అగర్వాల్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు.
ఈ బంతిని అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అర్ష్‌దీప్ సింగ్..ఈ క్రమంలో బంతిని బౌండరీ లైన్ బయటకు తన్నేసాడు. క్యాచ్ పట్టే క్రమంలో సమన్వయం కోల్పోయిన అర్ష్‌దీప్ సింగ్.. చూసుకోకుండా బంతిని బౌండరీలోకి తన్నాడు. దాంతో శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఏం మనిషివి రా అయ్యా'అని సైగలు చేస్తూ తన కోపాన్ని బయటపెట్టాడు. ఈ బంతికి ముందు 12 బంతులపాటు బౌండరీ రాలేదు. ఈ బౌండరీతో ఆర్‌సీబీ బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. దాంతో అయ్యర్ ఆగ్రహానికి గురయ్యాడు. అంతకుముందు ప్రియాన్ష్ ఆర్య బంతిని అందుకోవడంలో తడబడటంతో అతన్ని శ్రేయస్ అయ్యర్ మందలించాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.