మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు తమ హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ సీరియస్ అయ్యారని, తమను మందలించారని టీమిండియా యువ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీ చరణి తెలిపింది. ఆయన మందలించడంతోనే తాము మరింత మెరుగైన ప్రదర్శన చేశామని చెప్పింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు రెడీ అవుతున్న శ్రీ చరణి.. మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే బరిలోకి దిగనుంది.
డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ఢిల్లీ తరఫునే డబ్ల్యూపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన శ్రీ చరణి సంచలన ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చి 14 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంచలన ప్రదర్శనతో శ్రీ చరణి సూపర్ స్టార్‌గా నిలిచింది.

డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన శ్రీచరణి.. ప్రపంచకప్‌లో టీమిండియా పుంజుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినప్పుడు చాలా గందరగోళానికి గురయ్యాం. ఎందుకంటే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను మేం చేజేతులా చేజార్చుకున్నాం. అప్పుడు మా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ సర్ కాస్త సీరియస్ అయ్యారు.కానీ అది మా మంచికే జరిగిందని నేను భావిస్తున్నా. ఆ క్షణం తర్వాతే అన్నీ సవ్యంగా జరిగాయి. చివరికి మేం ప్రపంచకప్‌ను గెలుచుకున్నాం.
ప్రపంచకప్ విజయంతో నా జీవితం ఒక్కసారిగా ఏం మారిపోలేదు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత కొంతకాలం పాటు వేడుకలు, కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం, కానీ ఆ తర్వాత అంతా మామూలైపోయింది. నేను ఒత్తిడి గురించి ఏ మాత్రం ఆలోచించను. నాకు తెలిసిన విషయాలపైనే ఫోకస్ పెడుతాను. నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. ఫలితం గురించి ఆలోచించను. సహచర భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ మెరుగైన ప్రదర్శనను నేను పోటీగా భావించను. మేమంతా జట్టు కోసమే ఆడుతాం. ఒక రోజు ఆమె రాణిస్తే.. మరో రోజు నేను రాణించవచ్చు. కానీ అది నాకు ముఖ్యం కాదు. జట్టు గెలవడమే నాకు కీలకం.
జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఈ సారి మేం డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను గెలుస్తాం. జెమిమాలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే ఎదుటివారిని అర్థం చేసుకునే తీరు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు? ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో జెమీమాకు బాగా తెలుసు. ఆమె మాట్లాడే విధానం, ఉత్సాహపరిచే తీరు చాలా ప్రత్యేకం.'అని శ్రీ చరణి చెప్పుకొచ్చింది.