Shree Charani: ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన తెలుగు తేజం!
Shree Charani: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ ఫైనల్లోనే ఢిల్లీ ఓడింది. డబ్ల్యూపీఎల్ మొదలైనప్పటి నుంచి పట్టువదలకుండా ఫైనల్ చేరుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశనే మిగులుస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టైటిల్ పట్టుకుపోయింది. 204 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా తమది అసలైన ఛాంపియన్ జట్టని ఆర్‌సీబీ ప్రపంచానికి చాటి చెప్పింది.
బౌండరీల వర్షం కురిసిన తుది పోరులో ఓ దశలో ఆర్‌సీబీ సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తరహాలోనే క్లైమాక్స్ ఉత్కంఠకు చేరింది. 165 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆర్‌సీబీ విజయానికి బాటలు వేసిన జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) వెనువెంటనే ఔటవ్వడం.. బిగ్ హిట్టర్ రిచా ఘోష్ కూడా చేతులెత్తేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తెలుగు తేజం శ్రీచరణికి బంతిని అందించింది.

ఆఖరి ఓవర్‌లో హై డ్రామా
తొలి రెండు బంతులను కట్టడిగా వేసిన శ్రీచరణి ఢిల్లీ శిభిరంలో ఆశలు రేకెత్తించింది. మ్యాచ్ ఆర్‌సీబీ చేజారినట్లు అనిపించింది. కానీ మూడో బంతిని రాధా యాదవ్ ఓవర్ కవర్ దిశగా బౌండరీ తరలించి తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంది. మరుసటి బంతిని కూడా రాధా యాదవ్ జరిగి ఓవర్ కవర్ దిశగా బౌండరీ బాదింది. అయితే ఈ షాట్ ఆడగానే బెయిల్స్ కిందపడిపోయాయి. ఒకవైపు ఆర్‌సీబీ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు హిట్ వికెట్ అయ్యిందా? అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. కానీ కీపర్ చేతులు తగిలి బెయిల్స్ పడ్డాయని రిప్లేలో తేలింది.
ఈ ఓవర్‌ను శ్రీచరణి కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే ఆర్‌సీబీ ఓటమిపాలయ్యేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం మూడో బంతిని డాట్ చేసినా.. ఆర్‌సీబీపై ఒత్తిడి రెట్టింపు అయ్యేదని, అప్పుడు వారే వికెట్ పారేసుకునేవారని విశ్లేషిస్తున్నారు. శ్రీచరణిపై జెమీమా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు.
శ్రీ చరణి వల్లే..
ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో రాణించిన శ్రీచరణి ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వైఫల్యం ఢిల్లీ విజయవకాశాలను దెబ్బతీసాయని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీచరణి.. ఒక్క వికెట్ తీయకపోగా 46 పరుగులు సమర్పించుకుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేయాల్సిన తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయింది. దాంతోనే ఢిల్లీకి ఓటమి తప్పలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్‌లో దక్కిన విజయం శ్రీచరణి తలకెక్కిందని ఘాటుగా విమర్శిస్తున్నారు.
మరికొందరు మాత్రం శ్రీచరణికి అండగా నిలుస్తున్నారు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కూడా ధారళంగా పరుగులిచ్చుకుందని చెబుతున్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు శ్రీ చరణి ఏం చేస్తుందని విమర్శలను తిప్పికొడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications