తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ తన కాంట్రాక్టు రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారాన్ని షోయబ్ మాలిక్ ఖండించాడు.
వాస్తవాలు తెలుసుకొని కథనాలు రాయాలని హితవు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా షోయబ్ మాలిక్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. 'బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో నాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఫార్చూన్ బరిషల్ జట్టు నా కాంట్రాక్ట్‌ను రద్దు చేయలేదు. నేను మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో మాట్లాడాను.

ఫ్రాంచైజీతో పరస్పర అంగీకారంతోనే టోర్నీలో కొనసాగుతాను. దుబాయ్ మీడియాతో ముందస్తు ఒప్పందాల్లో భాగంగానే బీపీఎల్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటాలని ఫార్చూన్ బరిషల్ జట్టుకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నా అవసరం ఉంటే కచ్చితంగా వచ్చి ఆడుతాను. నేను ఆటలోనే ఆనందాన్ని వెతుక్కునే మనిషిని.
పుకార్లు వచ్చినప్పుడు ఖండించడం కీలకమనే విషయాన్ని నేను గుర్తించాను. ముఖ్యంగా ఈ మధ్య నాపై నిరాధారణమైన పుకార్లు వెలువడుతున్నాయి. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాస్తవాలు తెలుసుకొని కథనాలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిరాధారణమైన ఆరోపణలను వ్యాప్తి చేసే ముందు వాటిని ధృవీకరించుకోవడం కీలకం.
ఈ అసత్య ప్రచారాలు మనిషి గౌరవాన్ని దెబ్బతీస్తాయి. వాస్తవాలను మాత్రమే ప్రచురించే మీడియా సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వండి. విశ్వసనీయత కలిగిన వ్యక్తులు చెప్పిన మాటలనే నమ్మండి. ఏది ఏమైనా నాకు అండగా నిలిచి అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు.'అని మాలిక్ తన ప్రకటనలో రాసుకొచ్చాడు.
ఇక జనవరి 22న ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫార్చ్యూన్ బరిషల్ టీమ్ తరఫున బరిలోకి దిగిన మాలిక్.. ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు నోబాల్స్ వేసాడు. దాంతో ఆ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. సాధారణంగా స్పిన్నర్లు నో బాల్స్ వేయడం చాలా అరుదు. అలాంటి మాలిక్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారి తీసింది.
ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌పై వేటు వేయడంతో పాటు కాంట్రాక్ట్ రద్దు చేసుకుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి గురించి కూడా మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.
సనా జావేద్‌తో మాలిక్ గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అక్కడి మీడియా పేర్కొంది. ఈ విషయం నచ్చకనే సానియా మీర్జా.. మాలిక్‌ను వదిలేసిందని, మాలిక్ మూడో పెళ్లి అతని కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని వరుస కథనాలను ప్రచురించింది. ఈ వార్తలపై కూడా మాలిక్ పరోక్షంగా స్పందించాడు.