
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లీష్ రాకనే అతను బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడని తెలిపాడు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరని చెప్పాడు. దాంతో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్, చానెల్స్‌తో మాట్లాడాలంటే పాక్ ఆటగాళ్లు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపాడు. క్రికెట్‌లో ఆడటంతో పాటు మీడియాను ఫేస్ చేయడం కూడా కీలకమేనని తెలిపాడు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'పాకిస్థాన్‌లో ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లడగల క్రికెటర్లలో నేను, షాహిద్ అఫ్రిదీ, వసీం అక్రమ్ మాత్రమే ఉన్నాం. అందుకే మా ముగ్గురికే అన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. ఎందుకంటే మేం ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడటం ఓ ఉద్యోగంగా భావించాం. క్రికెట్‌లో రాణించడం ఒక ఎత్తు అయితే మీడియాతో మాట్లాడటం మరో ఎత్తు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో ఎవరూ కూడా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేరు. అవార్డు ప్రజంటేషన్‌లో చాలా అసౌకర్యంగా కనిపిస్తారు.
అందుకే బాబర్ ఇంగ్లీష్, హిందీ కలిపి మాట్లాడుతుంటాడు. బాబర్ ఆజామ్‌కు తన ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వర్ణించడం రాదు. అతనే గనుక ఇంగ్లీష్ చక్కగా మాట్లాడి ఉంటే పాక్‌లో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని బాబర్‌కు సూచించా. కానీ అతను పట్టించుకోలేదు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
అక్తర్ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ఆటగాళ్లను అవమానించేలా ఉన్నాయని మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా అక్తర్ వ్యాఖ్యలను ఖండించాడు. బాబర్ ఆజామ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరాడు.