టీమిండియా చేతిలో మరోసారి ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఆ టీమ్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. అసలు టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావడం లేదని, పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఏది సరిగ్గా లేదని విమర్శించాడు. తమ కెప్టెన్ సల్మాన్ అలీ అఘానే పెద్ద బొకడా గాడని, అతని వల్ల జట్టుకు నష్టం తప్పా ఒరిగేదేం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్-4 పోరులో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కాస్త పోటీ ఇచ్చినా.. భారత్ జోరుకు కళ్లెం వేయలేకపోయింది. అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అక్తర్.. పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేశాడు.

'పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిడిలార్డర్ సరిగ్గా ప్లాన్ చేయలేదు. పవర్‌ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం లేదు. బౌలర్లను కూడా తెలివిగా ఉపయోగించడం లేదు. ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేదు. బౌలింగ్ లైన్స్, లెంగ్త్‌లు చాలా పేలవంగా ఉన్నాయి. ఒక చెత్త బౌన్సర్‌తో బౌలింగ్ ప్రారంభించి మూల్యం చెల్లించుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
సల్మాన్ అలీ అఘా ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో అతనికే తెలియాలి. అతనే జట్టులో బలహీనమైన వ్యక్తి. అతను ఆడుతున్న స్థానానికి అసలు అర్హుడేనా.? జట్టులో అతను ఏం చేస్తున్నాడు..? అతని మంచి వ్యక్తి కావచ్చు. కానీ ఏం లాభం..? జట్టు కోసం ఏం చేస్తున్నాడు..? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలా రాణిస్తున్నాడా? కెప్టెన్‌గా అతను తీసుకునే నిర్ణయాలు జట్టును మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయి.'అని అక్తర్ విమర్శించాడు.
భారత బ్యాటర్ల విధ్వంసంతో కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా తడబడ్డాడు. పదే పదే బౌలర్లను మార్చాడు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు కూడా అక్తర్ సల్మాన్ అలీ అఘాపై విమర్శలు గుప్పించాడు. 'మా ఐన్‌స్టీన్ బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.'అని సెటైర్లు పేల్చాడు.