టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఈ తరం అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఎల్ టీ20 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షోయబ్ అక్తర్.. కామెంట్రీ కూడా చెబుతున్నాడు.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన అక్తర్.. అతన్ని సచిన్‌తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తరంతో పోటీ పడే ఆటగాడు కోహ్లీ మాత్రమేనని తెలిపాడు.
'మా తరంలో సచిన్ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వారు సంధించిన రివర్స్ స్వింగ్ బాల్స్ అద్భుతంగా ఆడాడు. ఈ తరంలో సచిన్ బ్యాటింగ్ చేసి ఉంటే చాలా పరుగులు చేసేవాడు. మా తరంలో సచిన్‌తో పాటు రికీ పాంటింగ్, బ్రియాన్ లారా అత్యుత్తమ బ్యాటర్లు.
బౌలింగ్‌లో వసీం అక్రమ్, షేన్ వార్న్‌లు అత్యుత్తమ బౌలర్లు. మా తరంతో పోటీ పడగల ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. మా తరంలో విరాట్ కోహ్లీ ఆడి ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ప్రస్తుతంలా సునాయసంగా పరుగులు చేసేవాడు కాదు.
ఇప్పటిలానే మా బౌలింగ్‌ను చీల్చి చెండాడినా.. వసీం అక్రమ్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయేవాడు. అతన్ని ఆడటం అంత సులువైన పనికాదు. అయితే విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీనే. ఈ తరం అత్యుత్తమ ఆటగాడు అతను. ఈ రెండు తరాలను పోల్చలేం. అతనికి హ్యాట్సాఫ్. అతను 100 సెంచరీలు సాధించాలని నేను కోరుకుంటున్నా'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 80 శతకాలు పూర్తి చేసుకున్నాడు. సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసేందుకు అతను మరో 20 శతకాల దూరంలో ఉన్నాడు. మరో నాలుగేళ్లు కోహ్లీ ఇదే జోరును కొనసాగిస్తే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో 552 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 54.11 సగటుతో 26,733 రన్స్ చేశాడు. ఇందులో 80 శతకాలతో పాటు 139 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో 50 శతకాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు.