
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ బౌలింగ్‌కు టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ భయపడ్డారని ఆ జట్టు దిగ్గజ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఈ భయంతోనే క్రీజులో నిలదొక్కుకోలేక వికెట్లు పారేసుకున్నారని అభిప్రాయపడ్డాడు. గత ఆదివారం జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో చిరస్మరణీ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే.
160 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఒత్తిడిని అధిగమించలేకపోయిన కేఎల్ రాహుల్.. నసీమ్ షా బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. రోహిత్ శర్మ సైతం హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఇఫ్తికార్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ నిరాశపర్చగా.. అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. దాంతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా జత కలిసిన కోహ్లీ విరోచిత పోరాటంతో చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
అయితే ఓపెనర్ల వైఫల్యంపై స్పందించిన షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఒత్తిడిలో కనిపించిందని.. పాకిస్థాన్ బౌలర్లను చూసి వారు భయపడినట్లు కనిపించారని అక్తర్ అభిప్రాయపడ్డాడు. 'భారత ఓపెనర్లు కొంచెం ఒత్తిడికి లోనైనట్లు, భయంతో కనిపించారు. కెప్టెన్‌గా రోహిత్ ప్రశాంతంగా ఉండటం అవసరం. రాహుల్ అతిగా ఫోకస్ చేస్తునాడు.అతని అప్రోచ్ కూడా సరిగ్గా లేదు. ఈ కారణంగా వికెట్ చేజార్చుకున్నాడు. అతను భయపడుతుండటంతో బౌలర్లు సులువుగా బుట్టులో వేసుకుంటున్నారు'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.