న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా ఆధిపత్యం చూస్తుంటే 2011 వన్డే ప్రపంచకప్ ఫలితం రిపీట్ అవ్వడం ఖాయమనిపిస్తోందన్నాడు. సెమీ ఫైనల్ గండం ధాటితే రోహిత్ సేనను ఎవ్వరూ ఆపలేరని జోస్యం చెప్పాడు. ఇక పాకిస్థాన్ జట్టును కోలుకోలేని దెబ్బతీసారని అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రంచకప్ 2023లో భాగంగా గత శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని టీమిండియా 8-0కు పెంచుకుంది. ఈ ఫలితంపై తాజాగా స్పందించిన అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'2011 వన్డే ప్రపంచకప్ చరిత్రను టీమిండియా రిపీట్ చేయబోతుంది. రోహిత్ సేన సెమీఫైనల్లో తడబడకపోతే వరల్డ్ కప్ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ప్రపంచకప్‌లో మీరు మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీశారు. ఇది మా నుంచి చాలా నిరుత్సాపరిచే ప్రదర్శన. పాకిస్థాన్‌ను భారత్ పూర్తిగా కోలుకోలేని దెబ్బ తీసింది.
రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతం. జట్టుకు అతడే ఒక సైన్యంలా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు ఈ టాలెంట్ ఎక్కడ పెట్టాడో అర్థం కావడం లేదు. అతనో పరిపూర్ణమైన బ్యాటర్. విభిన్నమైన షాట్లతో అలరించాడు. టీమిండియా కూడా అద్భుతంగా ఉంది. పాకిస్థాన్‌కు ఇది ఘోర పరాజయం. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిన్న పిల్లల జట్టు మాదిరిగా భారత్ దారుణంగా ఓడించింది.
నేను దానిని చూడలేకపోయాను. రోహిత్ శర్మ ఎలాంటి దయ లేకుండా మా బౌలర్లపై చెలరేగుతున్నాడు. గత రెండేళ్లుగా సరిగ్గా రాణించలేనందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా సాగింది.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
హ్యాట్రిక్ విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. తదుపరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19(ఆదివారం)న పుణె వేదికగా ఆడనుంది.