
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్రికెట్‌లో రూల్స్ తమ తరంలో ఉండి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లక్షకు పైగా పరుగులు చేసేవాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఐసీసీ తీసుకొస్తున్న నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటున్నాయన్నాడు. ఈ నిబంధనల వల్ల ఆట సహజత్వాన్ని కోల్పోతుందని విమర్శించాడు. ఈ తరం క్రికెట్‌లోలా రెండు కొత్త బంతులు, డీఆర్‌ఎస్‌లు ఉంటే సచిన్ మరిన్నీ పరుగులు చేసేవాడని అభిప్రాయపడ్డాడు.
'మీకు రెండు కొత్త బంతులు ఉన్నాయి. నిబంధనలను కఠినం చేశారు. ఈ మధ్య కాలంలో బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా నిబంధనలను రూపొందించారు. ఇప్పుడు మూడు రివ్యూలు ఇస్తున్నారు. సచిన్ టెండూల్కర్.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్ వంటి భీకర బౌలర్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని నేను టఫ్ బ్యాట్స్‌మన్ అంటాను. ఇప్పుడున్న నిబంధనలు మా రోజుల్లో ఉండి ఉంటే అతను సులువుగా లక్ష పరుగులకు పైగా చేసేవాడు.' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
క్రికెట్ పూర్తిగా బ్యాటింగ్ ఆధారిత ఆటగా మారిపోయిందని, కొత్త నిబంధనల వల్ల బౌలర్లకు నష్టం జరుగుతుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇదే విషయమై మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉండాలి. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉండటం బౌలర్లకు కష్టంగా మారింది. టెస్టుల్లో మూడు రివ్యూలు ఉండటం ఆమోద యోగ్యం కాదు'అని తెలిపాడు.