పీసీబీలో చేరే ప్రసక్తే లేదు.. అసలు కారణం బయటపెట్టిన షోయబ్ అక్తర్!
పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రధాన సెలెక్టర్ పదవిని చేపట్టనున్నారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. పీసీబీలో ఏ పదవి కూడా చేపట్టే ఆలోచన లేదా కోరిక తనకు లేదని, తద్వారా గత కొన్ని రోజులుగా ఊహాగానాలుగా సాగుతున్న వార్తలకు షోయబ్ అక్తర్ చెక్ పెట్టారు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోపాకిస్తాన్ 0-3 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం పీసీబీ పరిపాలనలో తీవ్ర కలకలం రేగింది. కోచింగ్ స్టాఫ్‌తో పాటు సెలక్షన్ కమిటీలోనూ భారీ మార్పులు ఉంటాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే షోయబ్ అక్తర్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నారంటూ పాకిస్తానీ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇదంతా అబద్ధమని షోయబ్ అక్తర్ స్పష్టం చేశారు.

ఓ పాకిస్తానీ టీవీ లైవ్ షోలో పాల్గొన్న సమయంలో ఈ విషయంపై షోయబ్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. గతంలో పీసీబీలోని రాజకీయాలకు దూరంగా ఉండమని తన తల్లి ఇచ్చిన సలహాను గుర్తుచేసుకుంటూ.. తాను ఇప్పటికీ ఆ సలహాకే కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. పీసీబీలో చేరడానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని.. హ్యాస్టన్ పర్యటనలో ఉన్న తనకు బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో చీఫ్ సెలెక్టర్ పాత్ర గురించి ఎలాంటి చర్చలు జరగలేదని వివరించారు.
అయితే పాకిస్తాన్ క్రికెట్‌కు మంచి జరగాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని షోయబ్ అక్తర్ వెల్లడించారు. దానికి పీసీబీలో పదవులు చేపట్టడం ఒక్కటే మార్గం కాదని.. ఇతర మాధ్యమాల ద్వారా కూడా సేవ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల మొహ్సిన్ నఖ్వీతో ఆయనకు సంబంధాలు మెరుగైన నేపథ్యంలో ఈ వార్త బాగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. అవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


