ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టులోనూ బలహీనతలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ టీమిండియాలో బలహీనమైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. అతనికి బదులు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాల్సిందన్నాడు. సంజూ శాంసన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఉండి ఉంటే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇంకాస్త ముందుగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసేదని తెలిపాడు.
ఆసియా కప్ 2025 టోర్నీకి ముందు టీ20ల్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఓపెనర్‌గా 10 ఇన్నింగ్స్‌ల్లో 3 శతకాలు బాదాడు. కానీ శుభ్‌మన్ గిల్ రాకతో సంజూ శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన సంజూ.. తీవ్రంగా తడబడ్డాడు. భారత విజయం ఖాయమైన పరిస్థితుల్లోనూ వేగంగా పరుగులు చేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ విజయం ఆలస్యమైంది.

ఇక మిడిలార్డర్‌లో సంజూ రాలేకపోతున్నాడని, అతని స్థానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఓ టీవీ షోలో మాట్లాడిన షోయబ్ అక్తర్ మాత్రం.. సంజూ శాంసన్‌కు బదులు కేఎల్ రాహుల్‌ను ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'టీమిండియాలో వికెట్ కీపర్ స్థానానికి సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ అర్హుడు. కానీ అతను జట్టులో లేడు. ఆసియా కప్ 2025 బరిలోకి దిగిన భారత జట్టులో సంజూ శాంసన్ ఒక్కడే బలహీనమైన ఆటగాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ 19వ ఓవర్ వరకు వెళ్లడానికి అతనే ప్రధాన కారణం. అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఉండి ఉంటే మరో 5 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేది.'అని అక్తర్ తెలిపాడు.
మరోవైపు సంజూ శాంసన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. సంజూను టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే వెనకేసుకొచ్చాడు. మిడిలార్డర్‌లో అతనే సరైన ఆటగాడని మేనేజ్‌మెంట్ భావిస్తుందని తెలిపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పిచ్ కాస్త కఠినంగా ఉందని, మిడిలార్డర్‌లో రాణించేందుకు సంజూ కష్టపడుతున్నాడని తెలిపాడు. భవిష్యత్తులో తన సత్తా ఏంటో చూపిస్తాడని చెప్పాడు.