Shoaib Akthar: అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే ఫిక్సింగే అంటారు!

కరాచీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే కీలక లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతుందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పాక్ అభిమానులు ఆరోపణలు గుప్పించే అవకాశం ఉందన్నాడు. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించిన టీమిండియా మెరుగైన రన్‌రేట్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలించింది. దాంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లతో గ్రూప్-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్ - న్యూజిలాండ్ మ్యాచ్‌తో గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది.

అఫ్గాన్ గెలిస్తే..
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్ సేన నేరుగా సెమీస్ చేరుతుంది. అదే అఫ్గాన్ గెలిస్తే.. 6 పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే సరిపోతుందో లెక్క తేలనుంది. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా అక్తర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.'అఫ్గాన్‌తో పోరులో కివీస్ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్ అభిమానులు ఊరుకోరని.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. రకరకాల హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తారు.

ఫిక్సింగ్ అంటూ..
టీ20 ప్రపంచకప్‌కు ముందు భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి పాక్ అభిమానులు మరిచిపోలేదు. పాక్, కివీస్ చేతిలో దారుణ పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్‌పై ఘన విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. ఇప్పుడు టీమిండియా సెమీస్ వెళ్లాలంటే అఫ్గాన్ చేతిలో కివీస్ ఓడిపోవడం ఒక్కటే మార్గం. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్ కావాలనే ఓడిపోయిదంటూ పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం ఖాయం. అలా జరగకూడదంటే అఫ్గాన్‌పై కివీస్ విజయం సాధిస్తే సరిపోతుంది.'అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్ చేతిలో భారత్ భవితవ్యం..
'ప్రస్తుతం భారత్ భవితవ్యం న్యూజిలాండ్ చేతిలో ఉంది. ఒక వేళ న్యూజిలాండ్ ఓడితే చాలా ప్రశ్నలు వ్యక్తమవుతాయి. నేను వివాదాలు సృష్టించాలని ఇలా చెప్పడం లేదు.
న్యూజిలాండ్ జట్టును హెచ్చరిస్తున్నా.. తదనంతర పరిణామాలను ఊహించి భయపడుతున్నా. సోషల్ మీడియాలో ఈ ఫలితమే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. న్యూజిలాండ్ విషయంలో పాక్ అభిమానుల సెంటిమెంట్స్ హైగా ఉన్నాయి. నా వరకైతే అఫ్గాన్ కంటే న్యూజిలాండే బలంగా కనిపిస్తుంది. కానీ ఆ జట్టుపై దేవుడు కన్నెర్ర చేస్తే మాత్రం ఆ జట్టు చెత్తగా ఆడి ఓడిపోవచ్చు. అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. సోషల్ మీడియాను ఎవరూ కూడా ఆపలేరు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే అక్తర్ టీమిండియా, పాకిస్తాన్‌లు ఫైనల్లో తలపడితే చూడాలని ఉందంటూ కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించి ఇప్పుడిలా మాట్లాడటంపై అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అఫ్గాన్ టీమ్‌ను కొనేసిందని..
ఇప్పటికే అఫ్గాన్ జట్టుపై భారత్ సాధించిన విజయంపై పాకిస్థాన్ అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు గుప్పించారు. అఫ్గాన్ టీమ్‌ను బీసీసీఐ కొనేసిందని, అందుకే ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదని పేర్కొన్నారు. టాస్ సమయంలో విరాట్ కోహ్లీ.. అఫ్గాన్ కెప్టెన్ మహమ్మద్ నబీతో అన్న మాటలను ప్రస్తావిస్తూ టీమిండియాపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోలింగ్‌ను భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో తిప్పికొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications