
కరాచీ: బాలీవుడ్ నటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడం వల్లే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. పెళ్లి విషయంలో కోహ్లీ తొందరపడ్డాడని తెలిపాడు. పెళ్లి అనేది విరాట్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందన్నాడు. తాను అతని ప్లేస్‌లో ఉంటే పెళ్లి కూడా చేసుకోకపోయేవాడినని అక్తర్ స్పష్టం చేశాడు.
ఇక గత రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ.. ఇటీవలే పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందే పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదిలేస్తానని కోహ్లీ ప్రకటించగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని బీసీసీఐ అతని వన్డే కెప్టెన్సీపై వేటు వేసింది. ఇక సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీనే టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్ గురించి దైనిక్ జాగ్రన్‌తో మాట్లాడిన అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేనే విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఉంటే పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు. కేవలం పరుగులు చేస్తూ.. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాడిని. బ్యాట్స్‌మన్‌గా ఈ 10-12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగిరాదు.
పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు. ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాలని కూడా అనడం లేదు. అయితే భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయాన్ని క్రికెట్‌కు కేటాయించి ఆస్వాదించాలంటున్నా.
విరాట్ కోహ్లీ అంటే అభిమానులకు పిచ్చి.. గత 14 ఏళ్లుగా విరాట్ పొందుతున్న ఆధరాభిమానుల ముందు వైవాహిక జీవితం చాలా చిన్నది. పెళ్లి అయితే కుటుంబం, పిల్లలు అనే ఒత్తిడి ఉంటుది. కుటుంబ బాధ్యతలు పెరిగే కొద్దీ, క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టిని పెట్టలేం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకోకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నా. పెళ్లయ్యాక విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగులు చేయలేదనే నా ఉద్దేశం.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. అయితే ప్రస్తుతం అతన్ని అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్ అన్న అక్తర్.. ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించాడని ప్రశంసించాడు. అయితే కోహ్లీ తన బలహీనతల నుంచి బయటపడి అతని సహజ స్థాయిలో ఆడాలని షోయబ్ అక్తర్ సూచించాడు.