
కరాచీ: పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. సరిగ్గా మ్యాచ్ ఆరంభానికి ముందు పెద్ద షాకిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. భద్రతా కారణాల వల్ల తాము ఈ పర్యటనల కొనసాగలేమని స్వదేశం పయనమైంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగి హామీ ఇచ్చినా ఆడేందుకు ససేమిరా అనింది. ఇలా చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌పై ఆ దేశ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ దేశంలో ఆటగాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని, హామీ ఇచ్చి కూడా సిరీస్ రద్దు చేసుకోవడం దారుణమని మండిపడుతున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అయితే.. న్యూజిలాండ్ పాక్ క్రికెట్‌ను చంపేసిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తాజాగా మరోసారి తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తమ ఆటగాళ్లకు సూచించాడు. న్యూజిలాండ్‌తో తలపడే తేదీని గుర్తుంచుకోవాలని ట్వీటర్ వేదికగా సూచించాడు. ఈ మేరకు.. 'తేదీ గుర్తుపెట్టుకోండి గాయ్స్. అక్కడే మన బలమేమిటో చూపించాలి'' అని ట్వీట్ చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్- న్యూజిలాండ్ అక్టోబరు 26న తలపడనున్నాయి. ఇక న్యూజిలాండ్ అర్దంతరంగా తప్పుకోవడంపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'ఈ ప్రకటన మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సిరీస్‌తో పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తాయని భావించాం. మా దేశ భద్రతా సంస్థల మీద పూర్తి నమ్మకం ఉంది'' అని కివీస్ తీరును విమర్శించాడు. ఇక 2003లో న్యూజిలాండ్.. చివరిసారిగా పాక్‌లో పర్యటించింది.
న్యూజిలాండ్‌లో పేలళ్లు సంభవించినప్పుడు పాక్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు అండగా నిలిచిందని అక్తర్ గుర్తు చేశాడు. 'న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది. అర్థంతరంగా సిరీస్ రద్దు చేసుకున్న కివీస్ జట్టును ముందుగా నేను కొన్ని ప్రశ్నలు అడగలనుకుంటున్నా. క్రైస్ట్‌చర్చిలో జరిగిన పేలుడులో 9 మంది పాకిస్తానీలు చనిపోయారు. మరి అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా?. అంతేగాక ఈ విషయంలో అప్పట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌కు మద్దతుగా నిలిచింది. కరోనా సంక్షోభం జోరుగా ఉన్న సమయంలో మేం మీ దేశంలో పర్యటించాం. అప్పడు మా ఆటగాళ్లకు మీ అధికారులు ఇచ్చిన భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నపళంగా సిరీస్ రద్దు చేసుకోవడం ఏంటో అర్ధం కావట్లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.