పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి రుబాబ్ ఖాన్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. షోయబ్ అక్తర్-రుబాబ్ దంపతులకు ఇప్పటికే మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీ అనే ఇద్దరు కుమారులున్నారు. 2016లో పెద్ద కొడుకు.. 2019లో చిన్న కుమారుడు జన్మంచాడు.
మూడో సంతానంగా శుక్రవారం అమ్మాయి పుట్టగా.. షోయబ్ అక్తర్ దంపతులు ఆ చిన్నారికి నూరే అలీ అక్తర్ అనే పేరు పెట్టారు. 2014లో షోయబ్ అక్తర్, రుబాబ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి సమయానికి అక్తర్ వయసు 38 ఏళ్లు కాగా.. రుబాబ్ వయసు 20 ఏళ్లు మాత్రమే. తనకంటే 18 ఏళ్ల చిన్నదైన రుబాబ్‌ను పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇక తనకు కూతురు పుట్టిన విషయాన్ని షోయబ్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీలకు తోడుగా ఇప్పుడు చిన్నారి చెల్లెలు వచ్చింది. ఆ అల్లా మాకు పండంటి ఆడబిడ్డను ప్రసాదించారు. 1445 AH షాబాన్ 19వ తేదీన(ఉర్తూ క్యాలెండర్) జుమ్మా ప్రార్థనల సమయంలో జన్మించిన నూరే అలీ అక్తర్‌కు స్వాగతం. మార్చి 1 2024న జన్మించిన నా కూతురిని ఆశీర్వదించండి.'అని చిన్నారి ఫొటోను అక్తర్ షేర్ చేశాడు.
ప్రస్తుతం షోయబ్ అక్తర్ వయసు 48 ఏళ్లు. దాంతో నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాత అయ్యే వయసులో తండ్రి అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పాకిస్థాన్‌లో మాత్రమే సాధ్యమవుతాయని, ఇంత లేటు వయసులో బిడ్డకు జన్మనించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
షోయబ్ అక్తర్.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరుగాంచిన విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలోనే అతను అత్యంత వేగమైన బంతిని విసిరాడు. గంటకు 161.3 కిలోమీటర్లతో అతను విసిరిన బంతి ఇప్పటి వరకు ఫాస్టెస్ బాల్‌గా కొనసాగుతోంది. 1997 నుంచి 2011 పాకిస్థాన్ తరఫున ఆడిన షోయబ్ అక్తర్ 178 టెస్ట్‌లు, 247 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.
మూడు ఫార్మాట్లలో కలిపి 16 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1999 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం అనలిస్ట్‌గా, కామెంటేటర్‌గా అక్తర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.