హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు క్యాన్సర్ రోగం పట్టిందని, అది నాలుగో దశలో ఉందని టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ జోక్యం చేసుకుంటే తప్పా హెచ్‌సీఏకు పట్టిన ఈ రోగం ఇప్పట్లో నయం కాదని రాయుడు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ ప్రముఖ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు ఆడకుండా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అడగడుగున అడ్డు పడ్డారని ఆరోపించాడు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్.. తన కొడుకు అర్జున్ యాదవ్ కోసం తన కెరీర్‌ను నాశనం చేశాడని తెలిపాడు. అర్జున్ యాదవ్‌కు తాను అడ్డుగా ఉన్నాననే మానసికంగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నాడు.

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ వివరణ కోసం సదరు చానెల్ ప్రయత్నించగా.. స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏ అధికారులతో పాటు శివలాల్ యాదవ్ కూడా ముఖం చాటేసినట్లు సదరు చానెల్ పేర్కొంది. ఆఫ్ ద రికార్డు మాత్రం కెరీర్‌కు అండగా నిలిచి, ఓ గొప్ప జీవితాన్ని ప్రసాదించిన హెచ్‌సీఏపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని హెచ్‌సీఏ అధికారులు అన్నట్లు తెలిపింది.
తల్లిలాంటి హెచ్‌సీఏపై నిందలు మోపడం అంబటి రాయుడికి తగదని పేర్కొన్నట్లు సమాచారం. ఇక రాయుడి ఆరోపణలపై స్పందించి అతన్ని పెద్ద చేయడం తమకు ఇష్టం లేదని శివలాల్ యాదవ్ సన్నిహితులు పేర్కొన్నట్లు సదరు చానెల్ పేర్కొంది.
హెచ్‌సీఏలో ఎన్నికలు జరుగుతుండటంతోనే రాయుడి ఆరోపణలపై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయుడి వ్యాఖ్యలకు స్పందించి రచ్చ చేసుకోవడం కంటే సైలెంట్‌గా ఉండటమే ముఖ్యమని శివలాల్ యాదవ్‌తో పాటు హెచ్‌సీఏ వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాయుడి వ్యాఖ్యలపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. గత ఎన్నికల్లో నెగ్గిన మహమ్మద్ అజారుద్దీన్ ప్యానల్ కూడా తర్వాత రెండుగా ఛీలిపోయింది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌ను కూడా ఆశ్రయించారు. అంతర్జాతీ మ్యాచ్ నిర్వహణ విషయంలోనూ టికెట్లు సరిగ్గా జారీ చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.