టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా జింబాబ్వేతో గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో శివమ్ దూబే చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శివమ్ దూబే ఒక వికెట్ తీసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి రెండు ఓవర్లలోనే అత్యధిక పరుగులిచ్చుకున్న తొలి బౌలర్‌గా చెత్త రికార్డ్‌ను మూటగట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్ వేసిన శివమ్ దూబే.. వరుసగా 2, 6, 4, 4, wd, 0, nb, wd, wd, 6లతో మొత్తం 26 పరుగులు ఇచ్చుకున్నాడు. 6 బంతుల వ్యవధిలోనే మూడు వైడ్స్, ఒక నోబాల్ వేయడంతో పాటు.. రెండు సిక్స్‌లు, రెండు బౌండరీలు సమర్పించుకున్నాడు. అయితే అతను లెగ్, హైట్ నోబాల్స్ కాకుండా పిచ్ బయట బాల్స్ వేయడంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు.
ఆఖరి ఓవర్‌లో మరోసారి అతనికి బౌలింగ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్.. తాను ఘోర తప్పిదం చేశాననే విషయాన్ని త్వరగానే గ్రహించాడు. ఈ ఓవర్ తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతిని నేరుగా కీపర్ ముందు పిచ్ చేశాడు. దాంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఆ తర్వాత వైడ్ వేయగా.. ఫ్రీహిట్ డెలివరీని తషింగా సిక్సర్ తరలించాడు. మరుసటి బంతికి సంజూ స్టన్నింగ్ క్యాచ్‌తో దూబేకు వికెట్ దక్కినా.. బ్రియన్ బెన్నెట్ 6, 4 బాదడంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి.

శివమ్ దూబేకు బౌలింగ్ ఇవ్వడం ఇక ఆపేయాలని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 12 బంతుల్లో 6 ఎక్స్‌ట్రాలు వేసిన దూబే ఏ బౌలర్ అని, లైన్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోతున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ పేసర్ మహమ్మద్ కైఫ్.. శివమ్ దూబే బౌలింగ్‌పై ఘాటైన విమర్శలు చేశాడు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దూబే ఆల్‌రౌండర్ కాదని, కేవలం బ్యాటరేనని మండిపడ్డాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు ఇచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించాడు. శివమ్ దూబేను కేవలం బ్యాటర్‌గా మాత్రమే పరిగణించాలని ఫ్యాన్స్ కూడా హితవు పలుకుతున్నారు.
ఈ ఏడాది దూబే 19.57 సగటుతో 8 వికెట్లు తీసాడు. అతని ఎకానమీ రేట్ 10 కంటే ఎక్కువగా ఉంది. బ్యాటింగ్‌లో శివమ్ దూబే మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. బౌలింగ్ మాత్రం అంత గొప్పగా లేదు. శివమ్ దూబే బౌలింగ్ వైఫల్యం టీమిండియా నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. రన్‌రేట్ ఇంకా నెగటీవ్‌గానే ఉంది. దూబే కట్టడిగా చేసి ఉంటే భారత్ భారీ మార్జిన్‌తో గెలిచేది. అప్పుడే రన్‌రేట్ ప్లస్‌లోకి వచ్చేంది. ప్రస్తుతానికి నెట్‌రన్‌రేట్‌తో పనిలేకున్నా.. వెస్టిండీస్‌తో మ్యాచ్ రద్దయితే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. మ్యాచ్ జరిగి గెలిస్తేనే టీమిండియా సెమీస్ చేరుతుంది.