ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.
ఈ విజయంతో ఓటమెరుగని జట్టుగా గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరింది. మరోవైపు నెదర్లాండ్స్.. ఓటమితో టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని ముగించింది. శివమ్ దూబే ఆల్‌రౌండ్(66, 2/35) ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుణ్ చక్రవర్తీ(3/14) మూడు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా..తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) దూకుడుగా ఆడలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్(3/56) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లేన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమిపాలైంది. బాస్ డీ లీడే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), జాచ్ లయన్(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26), నోహ్ క్రోస్(12 బంతుల్లో 5 ఫోర్లతో 25 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/14) మూడు వికెట్లు తీయగా.. శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. సూపర్-8 దశలో టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్(20)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో నెదర్లాండ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 36 పరుగులే చేసింది. హార్దిక్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ మిచెల్ లెవిట్ ఔటవ్వగా.. కొలిన్ అకర్‌మన్(23)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆ మరుసటి బంతికే ఆర్యన్ దత్(0)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా..ఆచితూచి ఆడిన బాస్ డీ లీడేను దూబే వెనక్కిపంపాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(15) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో నెదర్లాండ్స్ ఓటమి ఖాయమైంది. కానీ జాచ్ లయన్, నోహ్ క్రోస్ దూకుడుగా ఆడుతూ.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆఖరి ఓవర్‌లో నెదర్లాండ్స్ విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. శివమ్ దూబే ఒక వికెట్ తీయడంతో పాటు 10 పరుగులే ఇచ్చి భారత విజయలాంఛనాన్నిపూర్తి చేశాడు. అయితే ఈ ఓవర్‌లో లయన్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను సూర్య, తిలక్ వర్మ వదిలేసారు. ఆ మరుసటి బంతికే మరో క్యాచ్ ఇవ్వగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు.