ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ అహ్మద్‌పై నిషేధం విధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ఐపీఎల్ 2026 ఆడే వ్యవహరం చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ రూ.9.20 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో పోటీ పడి మరి కేకేఆర్ తీసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు.
అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో భారత్‌లో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముస్తాఫిజుర్‌ను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని కేకేఆర్‌ను శివసేన నాయకులు డిమాండ్ చేశారు. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
'ప్రస్తుతం దేశం మొత్తం బంగ్లాదేశ్‌పై కోపంగా ఉంది. ఈ పరిస్థితిలో బంగ్లాదేశీయులతో సంబంధం ఉన్న ఎవరైనా ప్రజాగ్రహానికి లోనవుతారు. షారుఖ్ ఖాన్ టార్గెట్ అవ్వక ముందే బంగ్లాదేశ్ ఆటగాడిని జట్టు నుంచి తొలగించడం మంచిది. ఇది షారుఖ్ ఖాన్‌తో పాటు దేశానికి శ్రేయాస్కారం.'అని శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ హెచ్చరించారు.

మరోవైపు ఉద్దవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 'పాకిస్థాన్ ఆటగాళ్ల తరహాలోనే బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలి. బంగ్లాదేశ్‌లో మన హిందూ సోదర సోదరీమణులను చంపడం చూడలేకపోతున్నాం. షారుఖ్ ఖాన్ వెంటనే ముస్తాఫిజుర్ అహ్మద్‌ను జట్టు నుంచి తొలగించాలి. భారత ప్రజల మనోభావాలని అతను అర్థం చేసుకోవాలి.'అని ఆనంద్ దూబే సూచించారు.
బంగ్లాదేశ్ ఆటగాడు ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లను అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్‌పై కూడా రాజకీయ ఒత్తిడి పెరిగింది. దాంతో కేకేఆర్ యాజమాన్యం ఏం నిర్ణయం తీసుకుంటుందో? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. "పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. మేం నిరంతరం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు మేం బంగ్లా ఆటగాళ్లపై ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేం. బంగ్లాదేశ్ శత్రు దేశం కాదు. కాబట్టి ప్రస్తుతం ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాం' అని తెలిపారు.