
గ్రాస్ ఇస్లెట్: ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన వెస్టిండీస్ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లోనూ 56 పరుగులతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి ధాటక జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), డ్వేన్ బ్రావో (34 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 47) ధనాధన్ బ్యాటింగ్‌తో దుమ్మురేపగా.. లెండీ సిమ్మన్స్(21 బంతుల్లో 30), ఆండ్రీ రస్సెల్(8 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, అష్టన్ అగర్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా.. 19.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. మిచెల్ మార్ష్(54) మినహా అంతా విఫలమ్యారు. ఓపెనర్లు మాథ్యువేడ్(0), ఆరోన్ ఫించ్(6), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్, హెన్రీక్స్(19), బెన్ మెక్‌డెర్మాట్(7), డాన్ క్రిస్టియన్(9) తీవ్రంగా నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో హైడెన్ వాల్ష్ (3/29) ఆసీస్ పతనాన్ని శాసించగా.. షెల్డన్ కాట్రెల్ రెండు, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రస్సెల్, డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మూడో టీ20 మంగళవారం జరగనుంది.
ఇక హెట్‌మైర్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు హెట్‌మైర్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసొస్తుందంటున్నారు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడం, హెట్‌మైర్ ఫామ్‌లో రావడం ఢిల్లీకి శుభపరిణామాలని కామెంట్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు విండీస్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే.. ఆ జట్టు ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదని మరికొందరు అంటున్నారు. అంచనాల్లేకుండా బరిలోకి దిగి చాంపియన్‌గా నిలవడం ఆ జట్టుకు అలవాటేనని గుర్తు చేస్తున్నారు.