టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. అతనికి ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు కోసం గురువారం ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపింది. అక్రమ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్ 1xBetకు ధావన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది. ఈ అక్రమ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్‌తో శిఖర్ ధావన్‌కు ఉన్న సంబంధాలపై స్పష్టత కోరేందుకు ఈడీ విచారణకు పిలిచింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద శిఖర్ ధావన్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేయనుంది.
గతేడాది ఆగస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్.. క్రికెట్ విశ్లేషకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్‌కు కూడా దూరమైన అతను.. లెజెండ్స్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ కూడా ఆడే అవకాశం ఉంది.

బెట్టింగ్ యాప్స్ కేసులో గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ విచారించింది. అలాగే.. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండలను కూడా తెలంగాణ పోలీసులు అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లపై విచారించారు. చట్ట విరుద్దంగా నడుస్తున్న ఈ యాప్స్ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే చట్ట విరుద్దమైన బెట్టింగ్ ఫ్లాట్ ఫామ్స్‌పై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది.
శిఖర్ ధావన్ 1xBet యాప్‌లో సహ యజమానిగా తేలితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం.. 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ అక్రమ యాప్ ద్వారా ధావన్ సంపాదించిన డబ్బు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం ఈ నేరానికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. ఇంకా నేరం రుజువు కాలేదు.