ధర్మశాల: కెప్టెన్‌గా తాను చేసిన ప్రయోగం బెడిసికొట్టిందని పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శిఖర్ ధావన్.. పేలవ బౌలింగ్‌తో పాటు అనాలోచిత నిర్ణయాలు కొంపముంచాయని తెలిపాడు.
చివరి ఓవర్‌ను తాను స్పిన్నర్‌తో వేయించడం దెబ్బతీసిందని, మూమెంటమ్ అక్కడే షిఫ్ట్ అయ్యిందని తెలిపాడు. 'ఈ ఓటమి చాలా అసహనానికి గురి చేసింది. పవర్ ప్లేలో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు. బంతి స్వింగ్ అయినప్పుడు మేం వికెట్లు తీయాల్సింది. ఇది చాలా హోరాహోరీ మ్యాచ్. విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాం. చివరి ఓవర్‌లో నోబాల్ పడ్డ తర్వాత మాలో ఆశలు రేకెత్తాయి.

లివింగ్ స్టోన్ అద్భుతంగా ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. చివరి ఓవర్‌ను స్పిన్నర్‌కు ఇస్తూ నేను చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఈ తప్పిదంతో మూమెంటమ్ కూడా మారిపోయింది. అంతకుముందు మా పేసర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ వేయకుండా 18-20 పరుగులు సమర్పించుకున్నారు. ఆ రెండు ఓవర్లు మా పతనాన్ని శాసించాయి.
పవర్ ప్లేలో కూడా మా పేసర్ సరైన ప్రదేశంలో హిట్ చేయలేదు. ఈ తరహా వికెట్‌పై వికెట్లు తీసినా తీయకున్నా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. ప్రతీ మ్యాచ్‌లో పవర్ ప్లేలో 50-60 పరుగులు ఇచ్చినా వికెట్లు తీసేవాళ్లం. 1-2 ఓవర్లు బంతి స్వింగ్ అవుతుందని మాకు తెలుసు. రెండో ఓవర్‌లో నేను ఔటవ్వడం.. తొలి ఓవర్ మెయిడిన్ అవ్వడం దెబ్బతీసింది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. పృథ్వీ షా(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), రీలే రోసౌ(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులే చేసి ఓటమిపాలైంది. లియామ్ లివింగ్ స్టోన్(48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 94) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా ఫలితం లేకపోయింది.
లివింగ్ స్టోన్‌కు తోడుగా అథర్వ టైడే(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.