Shikhar Dhawan: విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి చెప్పినట్లు చేస్తాం!

కొలంబో: శ్రీలంక పర్యటనలో సీనియర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచనలను పాటిస్తామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఏ ఆటగాడినైనా పరిశీలించాలని సూచిస్తే తప్పకుండా ఆడిస్తామని వెల్లడించాడు. ఈ టూర్‌తో తనతో కలిసి ఓపెనింగ్ చేసే ప్లేయర్ ఎవరో నిర్ణయించామని గబ్బర్ చెప్పుకొచ్చాడు. లంకతో తొలి వన్డేకు ముందు ధావన్ మీడియాతో మాట్లాడాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. అత్యుత్తమ 11 మందే బరిలోకి దిగుతారని, సిరీస్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

నేనైతే మాట్లాడలేదు..
'విరాట్ కోహ్లీ , రవిశాస్త్రితో నేనైతే ప్రత్యేకంగా మాట్లాడలేదు. రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లతో వారు కచ్చితంగా మాట్లాడే ఉంటారనుకుంటున్నా. ఆ సందేశం మాకు అందుతుంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ సిరీసులో ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. రవి భాయ్, విరాట్ ఎవరి గురించైనా చెబితే మేం వారిని ఆడిస్తాం. ఎందుకంటే ప్రపంచకప్ ముందు ఉన్న సిరీసు ఇదొక్కటే. సన్నాహకంగా ఆటగాళ్లను పరిశీలించాల్సిందే.

అత్యుత్తమ 11 మందికే..
ఈ సిరీస్ బరిలోకి దిగే తుది జట్టును ఎంపిక చేశాం. నా ఓపెనింగ్ భాగస్వామి ఎవరో తేల్చుకున్నాం. మ్యాచ్‌కు ముందు అతడెవరో చెబుతాం. మా బృందంలో ఎవరు ఎన్ని మ్యాచులు ఆడతారన్నది తెలియదు. ఎందుకంటే సిరీసు విజయమే మా లక్ష్యం. అత్యుత్తమ 11మందే బరిలోకి దిగుతారు. మెరుగైన స్పిన్నరే జట్టులో ఉంటాడు. అందరినీ ఆడించాలన్న నిబంధనేం లేదు. కుల్దీప్, యుజ్వేంద్ర చహల్ కలిసి ఆడారు. వారి సమన్వయం బాగుంటుంది. రాహుల్ చాహర్ సైతం మంచి స్పిన్నరే. వరుణ్ చక్రవర్తీ రాణిస్తున్నాడు' అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

కోచింగ్ ఆస్వాదిస్తున్నా..
రవిశాస్త్రి కోచింగ్‌లో ఎక్కువగా ఆడినా.. రాహుల్ భాయ్ కోచింగ్‌నూ ఆస్వాదిస్తున్నానని ధావన్ అన్నాడు. 'వారిద్దరూ భిన్నమైన వ్యక్తులు. ఎవరి బలాబలాలు వారివి. ఇద్దరూ సానుకూలంగా ఉంటారు. నేను రవిభాయ్‌తో ఎక్కువగా గడిపాను. అతడు ప్రేరణ కల్పించే తీరు భిన్నంగా ఉంటుంది. అతడు గంభీరంగా ఉంటాడు. రాహుల్ భాయ్ ప్రశాంతంగా ఉంటారు. పటిష్ఠంగా, స్థిరంగా కనిపిస్తారు. వారిద్దరి కోచింగ్‌ను నేను ఆస్వాదిస్తాను' అని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications