
బెంగళూరు: క్రికెట్ అభిమానుల పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఆటకు ముందు 'నోట్లాట'కు తెరలేసింది. బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ప్రారంభమైంది. మార్కీ(అత్యంత ముఖ్యమైన) జాబితాలోని ఆటగాళ్ల వేలం ప్రారంభించగా.. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు మొదటగా వచ్చింది. ఇక శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8 కోట్ల 25 భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన ధావన్ కోసం అతని పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా ప్రయత్నించింది.
రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీపడటంతో ధావన్ ధర అమాంతం పెరిగింది. ఇక రూ. 5 కోట్లు ఢిల్లీకి వెళ్తాడని అంతా భావిస్తుండగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చింది. తగ్గేదేలే అంటూ ఈ టీమిండియా స్టార్ ఓపెనర్ కోసం ప్రయత్నించింది. చివరకు పోటీ నుంచి ఢిల్లీ తప్పుకోవడంతో శిఖర్ ధావన్.. పంజాబ్ వశమయ్యాడు. ఇక గత సీజన్ మినీ వేలానికి ముందు రూ. 5.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. ఈ లెక్కన అతని ఐపీఎల్ సాలరీ రూ. 3 కోట్లకు పైగా పెరిగింది. ఇక శిఖర్ ధావన్‌ను తమ కెప్టెన్‌గా కూడా నియమించుకునే అవకాశం ఉండటంతో పంజాబ్ అతన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకోగా.. ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది. కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు తీసుకుంది.