ఇన్నింగ్స్ డిక్లేర్
షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా టాస్మానియన్ టైగర్స్, న్యూ సౌత్ వేల్స్ తలపడుతున్నాయి. న్యూ సౌత్ వేల్స్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఓ దశలో ఆ జట్టు 37 పరుగుల వ్యవధిలో కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పేసర్లు సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూ సౌత్ వేల్స్ 522 పరుగుల భారీ స్కోర్ చేసింది. అబాట్ 97 పరుగుల వద్ద ఉండగా.. ఫోర్ బాది సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే సౌత్ వేల్స్ కెప్టెన్ పీటర్ నెవిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అబోట్ తన తొలి సెంచరీని 116 బంతుల్లో చేశాడు.

బ్యాట్ విసిరేసిన స్టార్క్
అయితే పీటర్ నెవిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి మిచెల్ స్టార్క్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి సెంచరీ చేసే అవకాశం లేకుండా పోయింది. సహచర బౌలర్ సీన్ అబాట్ సెంచరీ చేయడం.. తాను అరుదైన మార్క్ అందుకోకపోవడంతో స్టార్క్ తమ సారథిపై అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్‌లోకి వెళుతూ చేతిలో ఉన్న బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. మరోవైపు గ్లోవ్స్ విసిరిపారేశాడు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'మిచెల్ స్టార్క్ సంతోషంగా లేడు' అని రాసుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు 'పాపం స్టార్క్', 'తొలిసారి సెంచరీ చేసే అవకాశం మిస్ అయింది' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అత్యధిక స్కోర్ 99
మార్చి 2013లో ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్.. తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువగా వచ్చాడు. మొహాలిలో జరిగిన ఆ టెస్ట్ మ్యాచులో 99 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అదే అతనికి అత్యధిక స్కోర్. అప్పటి నుండి స్టార్క్ మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. ఏడేళ్ల తర్వాతి రాకరాక వచ్చిన అవకాశాన్ని న్యూ సౌత్ వేల్స్ కెప్టెన్ పీటర్ నెవిల్ అడ్డుకున్నాడు. దీంతో స్టార్క్ అలా అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ న్యూ సౌత్ వేల్స్ 64 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్మానియన్ టైగర్స్ 239 రన్స్ చేసింది. ఫాలో ఆన్ ఆడిన సౌత్ వేల్స్.. 522 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టాస్మానియన్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 26 రన్స్ చేసింది.


Click it and Unblock the Notifications

సెహ్వాగ్ ఉచిత సలహా.. ఢిల్లీకి బాగానే కలిసొచ్చిందిగా!!










