వైడ్ బాల్ నిబంధనల్లో మార్పులు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్యాటర్లకు ప్రయోజకరంగా ఉన్న ఈ నిబంధనల్లో మార్పులు చేసి బౌలర్లకూ బెనిఫిట్ దక్కేలా చేయాలనుకుంటోందని సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్, ఐసీసీ క్రికెట్ కమిటీ మెంబర్ షాన్ పొలాక్ తెలిపాడు.
ప్రస్తుతం ఉన్న రూల్స్ కారణంగా బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలర్ల లయను దెబ్బతీసేందుకు బ్యాటర్లు క్రీజులో కదులుతూ ఉంటారు. బంతి వేసే చివరి నిమిషంలో స్టాన్స్ మార్చుకోవడం.. ముందుకు రావడం.. పక్కకు జరగడం చేస్తూ వినూత్న షాట్స్ ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో బౌలర్లు.. బంతిని స్టంప్స్‌కు దూరంగా వేస్తుంటారు.

బంతి వైడ్ మార్క్ బయటగా వెళ్తే.. బ్యాటర్ మూవ్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోకుండా వైడ్ ఇస్తారు. అయితే ఈ విషయంలో మార్పులు తీసుకురావడంపై ఐసీసీ ఫోకస్ పెట్టిందని షాన్ పొలాక్ తెలిపాడు. 'ఐసీసీ క్రికెట్ కమిటీ మెంబర్‌గా వైడ్ బాల్ నిబంధనలను మార్చే అంశంపై వర్క్ చేస్తున్నా. బ్యాటర్లతో పాటు బౌలర్లకూ ప్రయోజనం కలిగేలా రూల్స్‌ను మారుస్తాం.
ఇప్పుడున్న రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. బౌలర్లకు నష్టం చేస్తున్నాయి. ఒకవేళ బ్యాటర్ చివరి నిమిషంలో క్రీజులో నుంచి బయటకు వెళ్తే బౌలర్ సరైన ప్రదేశంలో బంతిని వేయలేడు. రన్నప్ చేసే సమయంలోనే ఎక్కడ బంతిని వేయాలని నిర్ణయించుకుంటాడు. ఒకవేళ బ్యాటర్ కదిలినప్పుడు బంతి దూరంగా వెళ్తే.. అప్పుడు ఆ బ్యాటర్ ఎక్కడైతే ఉన్నాడో.. అక్కడి నుంచే బంతి దూరాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి.
అప్పుడే వైడ్‌పై ఓ నిర్ణయానికి రావాలి. మేం చేయాలనుకుంటున్న మార్పు ఇదే. ఇది ప్రస్తుతం చర్చల దశలో ఉంది. బౌలర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఇలా ఆలోచన చేశాం.'అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు.